కారేపల్లి,సెప్టెంబర్ 1: ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. పేరుపల్లి సమీపంలో గల బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఈ మార్గంలో వంతెన పై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో పక్కనే గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నీళ్లు చేరే అవకాశం ఉన్నందున కాలనీవాసులను సురక్షిత ప్రాంతానికు తరలించేందుకు అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు.
ముట్లగూడెం సమీపంలో చీమలపాడు రహదారిపై ఉన్న వాగు పై నుండి నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. తోడిదల గూడెం వద్ద లలితాపురం పెద్ద చెరువు అలుగు పోస్తుండడంతో ఈ మార్గంలో కూడా రాకపోకలను నిలిపివేశారు. చీమలపాడు, చింతలపాడు, గాదెపాడు సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీళ్లు చేరాయని, ఈ మార్గాలలో ప్రయాణం చేసే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.