ఖమ్మం, జనవరి 23: ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పరిశుభ్ర నగరంగా పేరు తేవాలని సూచించారు. ఖమ్మం నగర అభివృద్ధిపై కేఎంసీ కమిషర్ ఆదర్శ్ సురభి, ఇతర అధికారులతో కలిసి కేఎంసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సహా అన్ని విభాగాల్లో ఆదర్శంగా నిలిచేలా ఖమ్మాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం నగర జనాభా 4.23 లక్షలకు చేరుకుందని, 69.50 ఎంఎల్‌టీల తాగునీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. అయితే వేసవిలో ఏ ప్రాంతంలోనూ నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది వివిధ గ్రాంట్ల కింద రూ.113.24 కోట్లతో 574 పనులు చేపట్టగా అందులో 488 పనులు పూర్తయ్యాయని, 19 పనులు పురోగతిలో ఉన్నాయని, 67 పనులు ఇంకా ప్రారంభించలేదని వివరించారు.
పూర్తయిన పనులకు గాను ఇప్పటి వరకు రూ.24.72 కోట్లను చెల్లించినట్లు చెప్పారు. పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు వేగం చేయాలని ఆదేశించారు. సుడా ద్వారా రూ.45.7 కోట్ల పనులు, పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా డీఎంఎఫ్టీ కింద రూ.10 కోట్ల పనులు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.2 కోట్లు, 15వ ఆర్థిక సంఘం టైడ్ ద్వారా రూ.3.70 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు. వీటిల్లో కొన్ని పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని, ఇంకొన్ని ప్రారంభం కాలేదని వెల్లడించారు. గత ఐదేళ్లలో ట్యాక్సుల ద్వారా రూ.110.53 కోట్లు, అద్దెల ద్వారా రూ.3.78 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.5.10 కోట్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ అనుమతుల ద్వారా రూ.92.56 కోట్లు, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ. 3 కోట్లు, పట్టణ ప్రగతి ద్వారా రూ.55 కోట్లు, ఇతర గ్రాంట్ల ద్వారా రూ.122.84 కోట్లు, నీటి పన్ను ద్వారా రూ.13.01 కోట్లు కలిపి మొత్తంగా రూ.405.82 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు తెలిపారు. 2023-24 సంవత్సరానికి రూ.3984.07 లక్షల పన్ను వసూలు డిమాండ్ ఉండగా.. ఇప్పటి వరకు రూ.1751 లక్షలు వసూలు అయినట్లు చెప్పారు. పకా ప్రణాళికతో 100 శాతం వసూళ్లు చేయాలని సూచించారు.
విలువైన ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు, ఆక్రమణకు గురైన స్థలాలు, ఎన్నెస్పీ స్థలాలు ఎకడ ఉన్నాయి? ఎంత మేరకు ఉన్నాయి? అనే అంశంపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఆక్రమణలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లకారం, ఖానాపురం, మున్నేరు, ధంసలాపురం వద్ద బఫర్ జోన్ డీమారు చేశారని, ఆ ప్రాంతంలో నిర్మాణాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో వచ్చే 25 ఏళ్ల అవసరాల ప్లానింగ్‌తో ఏయే ప్రదేశాల్లో రోడ్ల విస్తరణ ఆవశ్యకత ఉందో పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కాగా, సమీక్షలో సుడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌కు మార్పులపై కూడా చర్చించారు. రాష్ట్రం, కేంద్రం నుంచి నిధులు తెస్తామని అన్నారు. అయితే, ప్రాజెక్టుల ద్వారా కల్పించే వినోదానికి ట్యాక్స్ వసూలు చేయాలని, ట్యాక్స్ ద్వారా ఆ ప్రాజెక్టులు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా పనిచేయాలని సూచించారు. నిబద్ధతతో నగర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అధికారులు గణేశ్, సురేందర్, సత్యనారాయణరెడ్డి, రంజిత్, కృష్ణలాల్ పాల్గొన్నారు.