కారేపల్లి, సెప్టెంబర్ 10 : నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి అన్నారు. కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల నివారణ, ర్యాగింగ్, బెట్టింగ్ యాప్స్ పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐ పాల్గొని మాట్లాడుతూ.. భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో ముందుకెళ్తున్న విద్యార్థులు అనేక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారి యువ శక్తిని నిర్వీర్యం చేస్తుందని, నిషేధిత మాదక ద్రవ్యాల జోలికి యువత వెళ్లవద్దని చెప్పారు.
దేశ అభివృద్ధి కోసం దోహదపడే సాంకేతికతను మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలని, వాటిని దుర్వినియోగం చేయకూడదని అన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఆశయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి ఎస్ఐ గోపి, ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Karepally : మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి