ఖమ్మం నగరంలో శనివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. తొలుత ధాన్యం సేకరణ అంశంపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను పంపిణీ చేశారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. పటేల్ స్టేడియంలో టెన్నిస్ కోర్టు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారికి అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్నారు.
ఖమ్మం, మే 6: అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మామూలు ధాన్యానికి ఇచ్చిన ధరనే తడిసిన ధాన్యానికీ చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ అంశంపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని, రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తెస్తే సేకరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకాల వర్షాలు కురవడం, పంటలు తడిసిపోవడం వంటి కారణాలతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. జూలై మొదటి వారంలోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఒక గింజ కూడా పోకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసుధన్, డీఆర్డీవో విద్యాచందన, డీసీవో విజయకుమారి, డీటీవో తోట కిషన్‌రావు, అదనపు డీసీపీ సుభాశ్ చంద్రబోస్, ఏసీపీ గణేశ్, డీసీఎస్వో రాజేందర్, డీసీఎస్ఎం సో ములు, ఏఎంటీ నర్సింహ రావు, డీఎం వో నాగరాజు, మార్ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, బోయపాటి వాసు, సత్యం బాబు పాల్గొన్నారు.