ఖమ్మం, సెప్టెంబర్ 21 : బీఆర్ఎస్సే ప్రజల గ్యారెంటీ కార్డని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఎవరెవరో వచ్చి గ్యారెంటీ కార్డులు ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున నమ్మితే మళ్లీ పాత రోజులు చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరి గ్యారెంటీ అకర్లేదని, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీ చాలని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇంతకు రెండింతల అభివృద్ధిని ప్రజలు చూస్తారని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. రూ.వందల కోట్లతో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. రూ.2.95 కోట్ల నిధులతో ఆయా డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 19వ డివిజన్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్లు, 16వ డివిజన్లో రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, రూ.50 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, 14వ డివిజన్లో రూ.85 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను మంత్రి శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుంచి ఖమ్మాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. ఖమ్మం నగరం తన ఇల్లు అని, ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులని అన్నారు. కాబట్టే తన ఇంటిలాంటి ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దానని అన్నారు.
30న ఖమ్మానికి మంత్రి కేటీఆర్..
ఖమ్మం నగరానికి వచ్చినన్ని నిధులు ఏ మున్సిపల్ కార్పొరేషన్‌కూ రాలేదని, అది కేవలం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైందని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. ఇంకా మరిన్ని నిధులు తెచ్చి మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఖమ్మానికి వస్తారని, రూ.1,200 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, కూరాకుల నాగభూషణం, చామకూరి వెంకన్న, మేడారపు వెంకటేశ్వర్లు, కూరాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, కృష్ణలాల్, రంజిత్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, దేవభక్తుని కిశోర్‌బాబు, కొల్లు పద్మ, బిచ్చాల తిరుమలరావు, పరమేశ్ పాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం
మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకుందని మంత్రి అజయ్ గుర్తుచేశారు. లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తితోనే ఉద్యమ నేత కేసీఅర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. కమర్తపు మురళి, షకినా, బొమ్మా రాజేశ్వరరావు, చిలకమర్రి శ్రీనివాస్‌బాబు, బెండెం జనార్దన్, బండారు శ్రీనివాస్, సత్యనారాయణ, పిల్లలమర్రి కొండలరావు, సంపత్, మసురం శివరామకృష్ణ పాల్గొన్నారు.