ఖమ్మం లీగల్, ఫిబ్రవరి 1 : మానసికోల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా అన్నారు. సాహస్ చౌదరి మోమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహిళా న్యాయవాదుల మూడవ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిపోయిన వారు కుంగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి అప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందన్నారు.
క్రీడల నిర్వాహకుడు, న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరిని ఆమె అభినందించారు. జిల్లా జడ్జి రాజగోపాల్ మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది బిచ్చాల తిరుమలరావు, సుగుణారావు, బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.కృష్ణారావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.