పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. హిందీ పరీక్షకు అదనంగా 20 నిమిషాల సమయం కేటాయించారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు ఉంటుంది.
ఖమ్మం జిల్లాలో 97 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 16,788 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. భద్రాద్రి జిల్లాలోని 73 కేంద్రాల్లో 12,282 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే పరీక్షలను 97 సిట్టింగ్, ఆరు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఖమ్మం జిల్లాలోని పరీక్షల కోసం 1,595 మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు.
-ఖమ్మం అర్బన్, మార్చి 20
పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు ఏ ఒక్కరికీ అనుమతి లేదు. ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు కూడా మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని టెన్త్ బోర్డు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు సీఎస్‌లు, డీవోల సమావేశంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలో పరీక్షల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఉండాలని, అందుకు ఫ్లయింగ్ స్కాడ్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
విద్యార్థులు నేరుగా విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను పొందేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై విద్యార్థి ఫొటో అతికిస్తే సరిపోతుందని, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలనే నిబంధన ఏమీ లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ సౌకర్యం అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. ఏఎన్ఎం కూడా పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉంటారు. విద్యార్థుల సందేహాల నివృత్తి, ఇబ్బందుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమును ఏర్పాటుచేసి 8331851510 అనే హెల్ప్‌లైన్ నంబరును కూడా అందుబాటులో ఉంచారు.
విద్యాశాఖ సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి టెన్త్ పరీక్షల ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిశీలకురాలిగా విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందికి సూచనలు చేస్తారు. ఇప్పటికే టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెండు జిల్లాల డీఈవోల నుంచి పరీక్షల ఏర్పాట్ల వివరాలు సేకరించారు.
పరీక్ష కేంద్రాల తనిఖీల ఫ్లయింగ్ స్కాడ్లు వారికి కేటాయించిన రూట్లకు అనుగుణంగా తనిఖీలు చేయాలని డీఈవో సోమశేఖర శర్మ సూచించారు. ఖమ్మంలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఫ్లయింగ్ స్కాడ్‌లకు పలు సూచనలు చేశారు. తనిఖీలు చేసే క్రమంలో అనువణువునూ నిశితంగా పరిశీలించాలని, నిబంధనలు అమలు చేసే క్రమంలో నిక్కచ్చిగా వెళ్లాలని స్పష్టం చేశారు. అవాంతరాలుంటే వెంటనే సమాచారమివ్వాలని సూచించారు. అనంతరం నిర్వాహకులతో జూమ్ సమావేశం నిర్వహించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.