ఖమ్మం, డిసెంబర్ 29 : ధనుర్మాసం అంటే.. దివ్య ప్రార్థనకు అనువైన మాసమని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాద రామానుజ జీయర్ స్వామి అన్నారు. ధనుర్మాసం పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం కమాన్ బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన జడ్పీ సెంటర్ పొలాస్ వద్ద ధనుర్మాసం ప్రత్యేకత గురించి వివరించారు. ధనుర్మాస పుణ్యకాలంలో ఒక రోజు విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యేళ్లు విష్ణువును భక్తితో పూజించినట్లేనని అన్నారు. ధను అనగా.. దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనదని వివరించారు. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగమని, దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలిసిన అంశాల్లో ధనుర్మాసం ఒకటని పేర్కొన్నారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులపాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారని, సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారని వివరించారు. భక్తులు భగవంతుని వైపు విశ్వాసం ఉంచి జీవితాన్ని కొనసాగించాలని, అప్పుడు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు పోలా శ్రీనివాస్, మధుసూదనరావు, యాదగిరి, వెంకటనారాయణ, పావని, నర్మద, ఉషాకన్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు.