రఘునాథపాలెం, జూన్ 15 : అన్నదాతలు ఈ ఏడాది వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాదీ రైతులకు నకిలీ విత్తనాల గండం తప్పడం లేదు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆలస్యంగా తనిఖీలు చేస్తుండటంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయాలు జిల్లాలో ప్రతి ఏటా యథేచ్ఛగా సాగుతున్నాయి. రైతన్నలు సాగుకు సిద్ధమవుతున్న దశలోనే అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంది.. కానీ, ఆ దిశగా ఏనాడూ చర్యలు చేపట్టింది లేదు.
ఎక్కడైనా నకిలీ విత్తనాలు పట్టుబడితే మాత్రం ఆ రెండ్రోజులు తెగ హడావుడి చేస్తుంటారు. నకిలీ విత్తనాలతోపాటు కాలపరిమితి ముగిసిన ఎరువులను విక్రయిస్తున్నట్లు ప్రతి ఏటా విజిలెన్స్ దాడుల్లో గుర్తిస్తూనే ఉన్నారు. అయితే ముందస్తు తనిఖీలతో ‘నకిలీ’కి స్వస్తి చెప్పవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే.. దుకాణాల తనిఖీల్లో లోపాలు బయటపడినప్పుడు కొంతమంది అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో విత్తన, ఎరువుల షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. గడువు ముగిసిన, నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులను విక్రయించడంతో పంట దిగుబడి దెబ్బతిని రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నారు. జిల్లాలో గతేడాది ఈ తరహాలో పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో లోపాలు వెలుగుచూడటం కలకలం రేపింది. అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అనేక దుకాణాల్లో లోటుపాట్లు వెలుగుచూసే అవకాశం ఉంది. తనిఖీలను పారదర్శకంగా నిర్వహిస్తే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.
వ్యవసాయాధికారులు మాత్రం వ్యాపారులతో చేతులు కలిపి తూతూమంత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేయడం, ఎరువుల సరఫరా కొరతను సృష్టించి సొమ్ము చేసుకోవడం వ్యాపారులకు అలవాటుగా మారింది. స్టాక్ రిజిస్టర్లను సరిగ్గా నిర్వహించడం లేదు. కొన్ని దుకాణాలు లైసెన్స్ లేకుండా, గడువు ముగిసిన లైసెన్స్‌తో వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, నాసిరకం ఉత్పత్తులను అధిక నాణ్యత కలిగినవిగా చెప్పి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఎరువులు, విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించడానికి హోర్డింగ్ చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. ధ్రువీకరించని విత్తనాలు, నిషేధిత రసాయనాలతో కూడిన ఎరువులు, అనధికారిక ఉత్పత్తుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ప్రమాణాలు పాటించని దుకాణాలు ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందాలి. లైసెన్స్ పొందడానికి దుకాణం యజమాని నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి. దుకాణం స్థలం, నిల్వ సౌకర్యం, ఎరువులు, విత్తనాలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు.. ఎఫ్సీవో, బీఐఎస్, సీడ్ సర్టిఫికెట్స్ స్టాండర్డ్స్ వంటివి పాటించాలి. విత్తనాలకు సంబంధించి ధ్రువీకరణ, నాణ్యత గుర్తింపు ఉండాలి. ఎరువులపై రసాయన కూర్పు, తయారీ, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్ వంటి వివరాలు స్పష్టంగా లేబుల్స్‌పై ఉండాలి. ఎరువుల ధరలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారం ఎమ్మార్పీకి మాత్రమే విక్రయించాలి.
విత్తన ధరలు తయారీదారు నిర్దేశించిన ధరలకు అనుగుణంగా ఉండాలి. దుకాణాలు తమ స్టాక్ వివరాలను రిజిస్టర్లో పొందుపరచాలి. ఇందులో కొనుగోలు, విక్రయం, నిల్వల వివరాలు స్పష్టంగా ఉండాలి. అధికారుల తనిఖీ సమయంలో ఈ రికార్డులను సమర్పించాలి. దుకాణంలో లైసెన్స్, ధరల జాబితా, స్టాక్ వివరాలను ప్రదర్శించాలి. ఎరువులు, విత్తనాలను తేమ, వేడి ఇతర పర్యావరణ కారకాల నుంచి రక్షించే విధంగా నిల్వ చేయాలి, నాసిరకం, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించకూడదు. కొన్ని దుకాణాలు ఎరువులు, విత్తనాలతోపాటు పురుగు మందులు కూడా విక్రయిస్తాయి. ఇవి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968 కింద నిబంధనలను పాటించాలి, ఇవేమీ సగానికి ఎక్కువ అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ వెనుకాడుతుండటం విడ్డూరంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎరువులు విత్తనాల దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వం కఠినచర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు, ఇతర వినియోగదారులు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వైబ్‌సైట్ లేదా ఈ-కృషి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. నాసిరకం ఉత్పత్తులు, అధిక ధరలతో నష్టపోయిన రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయవచ్చు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు తీసుకోవడం, లేబుళ్లను పరిశీలించడం, నాణ్యత గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేలా రైతు సంఘాలు, స్థానిక సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకరావొచ్చు.