ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 23 : లక్ష్య సాధనలో వైకల్యం అడ్డుకావద్దని, ఆత్మైస్థెర్యం, పట్టుదలతో ముందుకెళ్తూ వైకల్యం శరీరానికి తప్ప మనస్సు, ఆలోచనలకు కాదని నిరూపించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఆటలపోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు.
కీడ్రాపోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి దివ్యాంగుడిని పలకరిస్తూ వారికి కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ, వారి సంతోషంలో పాలు పంచుకున్నారు. క్రీడా పోటీల్లో వారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధపడుతారన్నారు. కానీ వైకల్యం లక్ష్యసాధనలో అడ్డుకావద్దన్నారు. దివ్యాంగులు ట్రైసైకిల్, పరుగు, చెస్, క్యారమ్స్, షార్ట్‌పుట్ ఆటలు ఆడారు. విజేతలకు డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే రాంగోపాల్‌రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.