ఖమ్మం రూరల్, జూన్ 24: మున్నేరుకు ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి నగరంలోని మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, నిర్వాసితులకు పోలెపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, పోలెపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.
రిటైనింగ్ వాల్, డ్రెయిన్, రోడ్డు నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్త్ వర్కు 41 శాతానికి పైగా, సిమెంట్ కాంక్రీట్ పనులు 32 శాతం పూర్తయ్యాయని, నగరం నుంచి వచ్చే వరద నీరు నిర్వహణ, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి గల చర్యలపై అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్నేరుకు ఇరువైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల చొప్పున 17 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, ఇందుకోసం 138 ఎకరాల పట్టా భూమిని సేకరించాల్సి ఉందన్నారు.
అయితే పోలెపల్లిలో సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసి నిర్వాసితులకు పరిహారంగా అందించేలా ఒప్పించాలన్నారు. ఆకేరు, మున్నేరు నీటిమట్టం, వరద ప్రవాహ ఉధృతిపై ముందస్తు సమాచారం చేరవేసి ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్డీవో జి.నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేశ్, తహసీల్దార్లు సైదులు, పి.రాంప్రసాద్, ఇరిగేషన్ డీఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.