భదాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిలాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో కలిసి భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి సమీపంలోని ప్రాజెక్ట్ 4వ పంప్‌హౌజ్ పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. తక్కువ ఖర్చుతో నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించేలా చర్య లు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా రూ.13,500 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రికి ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికి మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తి చేశామని, త్వరలో 4వ పంప్ హౌజ్‌ను కూడా పూర్తి చేస్తామన్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. టన్నెల్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఆ పనుల్లోనూ వేగం పెంచాలని ఇరిగేషన్ సీఈకి సూచించారు. అవసరమైతే అత్యాధునిక సాంకేతిక యంత్రాలను వినియోగించాలన్నారు.
యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయితే సత్తుపల్లి ట్రంక్, లంకాసాగర్ ప్రాజెక్టుకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. మిగిలిపోయిన భూసేకరణ, అటవీ అనుమతులు వంటి పనులతోపాటు జెన్కో పవర్ హౌజ్ టెండర్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వర్షాకాలం నాటికి వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించాల్సి ఉంటుందన్నారు. జలాలు వస్తే ఇక రైతులు నాగార్జున సాగర్ జలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ ఏడాది 1-1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే వచ్చే ఏడాది మరో 1-1.5 లక్షల ఎకరాలకు జలాలు అందివ్వొచ్చన్నారు. ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 6.74 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించవచ్చన్నారు. మంత్రి పర్యటనలో ఇగిరేషన్ ఎస్ఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జున్, శ్రీనివాస్, సురేష్ ఉన్నారు.