మామిళ్లగూడెం, జూలై 15 : జిల్లాలో డ్రగ్స్ సరఫరా, నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం, నియంత్రణపై ఈ బృందాలు నిరంతరం పని చేస్తాయని తెలిపారు. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్, డీ అడిక్షన్, ప్రివెన్షన్పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీస్ శాఖ యాంటీ నారోటిక్ డ్రగ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం యాంటీ డ్రగ్ కంట్రోల్ విభాగం 8712659123 సెల్ ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయి వినియోగిస్తున్న వారిని సైతం గుర్తించి వైద్య సదుపాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మత్తు పదార్థాలు రవాణా జరుగకుండా తనిఖీలు పటిష్టం చేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.