భద్రాచలం, మార్చి 25: భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆన్లైన్ లింకును రూపొందించినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టే బందోబస్తుపై ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున 2 వేల మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాహనాల పారింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరఫున ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను, అలాగే ఆన్లైన్ లింకును రూపొందించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, సీఐ నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.