ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్‌శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగదారులతోపాటు చిన్నతరహా, భారీ పరిశ్రమలు, వ్యవసాయరంగానికి ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మంజిల్లాలో విద్యుత్ సరఫరా, డిమాండ్, వినియోగదారులకు అందిస్తున్న సేవలు, ఈ వేసవి సీజన్లో తీసుకునే చర్యలపై శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
-ఖమ్మం, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జవాబు: ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవికాలంలో విద్యుత్ కోతలు విధించే అవకాశం లేదు. డిమాండ్‌కు తగినంత విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే డిమాండ్, సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా సబ్స్టేషన్ల పరిధిలో మరమ్మతులు, బ్రేక్డౌన్లు ఉంటే తప్ప విద్యుత్‌కు అంతరాయం ఉండదు.
జవాబు: ఖమ్మం జిల్లాలో ఓవరు లోడ్ సమస్యను ఇప్పటికే గుర్తించాం. ఓవరు లోడు ఉన్నచోట అదనపు ట్రాన్స్ఫార్మర్లను, అవసరం ఉన్నచోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను పెడుతున్నాం. పెరిగిన లోడ్‌కు తట్టుకోవడానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని పెంచుతున్నాం. జిల్లాలో ఓవరు లోడు వల్ల ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం.
జవాబు: ఖమ్మం జిల్లాలో 33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో 36 కొత్త లైన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించాం. ఇందులో ఇప్పటికే 9 లైన్ల నిర్మాణం పూర్తయింది. 11కేవీలో 150 యాంప్స్ మించిన వాటికి లైన్లు విడదీసి కొత్త లైన్లు వేశాం. ఓవరు లోడు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మూడు రకాలుగా విభజించి గుర్తించాం. 100శాతం లోడు, 80శాతం లోడు, 60శాతం లోడు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి లేదా అదనపు సామర్ధ్యం కలిగినవి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 767 ఓవరు లోడు ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి 191 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. 75 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాం.
జవాబు: ఏ కారణంచేతైనా ఇళ్లలో విద్యుత్‌కు అంతరాయం కలిగితే ఆ ప్రాంతంలో ఉన్న సిబ్బందితోపాటు ప్రత్యేకంగా జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ బృందానికి ప్రత్యేక వాహనంతోపాటు విద్యుత్‌కు సంబంధించిన పూర్తి మెటీరియల్ అందుబాటులో ఉంచాం. విద్యుత్ అంతరాయం కలిగిందని సమాచారం వచ్చిన క్షణాల్లో ఈ బృందం అక్కడ ఉండి మరమ్మతులు చేపడుతుంది. ప్రస్తుతం ఖమ్మం, మధిర, వైరాలో ఈ బృందాలు పని చేస్తున్నాయి.
జవాబు: ఖమ్మం జిల్లా విద్యుత్ వినియోగం రోజువారీ వినియోగం కోటా 6.96 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతం 9.9 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాం. ఈ వేసవిలో రోజువారీ గరిష్ట డిమాండ్ 470 మెగావాట్లు ఉంటుందని అంచనా వేశాం.
జవాబు: జిల్లాలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్లకు మెటీరియల్ ఇబ్బంది లేకుండా అగ్రి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం వ్యవసాయ కొత్త కనెక్షన్ల కోసం 1,434 దరఖాస్తులు వచ్చాయి. సీనియారిటీ ప్రకారం కనెక్షన్లు ఇస్తున్నాం.
జవాబు: జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 4.84 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 1.18 లక్షలు, భారీ పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు 3,743, కుటీర పరిశ్రమల కనెక్షన్లు 505 మొత్తం 6,81,905 కనెక్షన్లు జిల్లాలో ఉన్నాయి.
జవాబు: విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, సమస్యలు వస్తే తక్షణం పరిష్కరించేందుకు ‘విద్యుత్ అధికారుల పొలంబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైతుల వద్దకు విద్యుత్ అధికారులు వెళ్లి వారి సమస్యను పరిష్కరించడంతోపాటు విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక నిపుణుల బృందంతో అవగాహన కల్పిస్తున్నాం.