కారేపల్లి,జులై 30 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బోటితండా గ్రామంలో బుధవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చీమలపాడు ఉప ఆరోగ్య కేంద్రం ఎంఎల్ హెచ్ పి కళ్యాణి రక్త నమూనాలను సేకరించి డెంగ్యూ, మలేరియా, రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ వ్యాధి గ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోటితండా, చింతల తండా గ్రామాలలో పర్యటించి గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
అదేవిధంగా దోమల వ్యాప్తిని నివారించటం, విష జ్వరాలు, సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల పలు సూచనలు చేశారు. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని ప్రజలకు సూచించారు. జ్వరం, కాళ్లు, కీళ్లు, ఒళ్ళు నొప్పులు, ఇతర అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే సబ్ సెంటర్కు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాలలో ఆశా కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ముక్తి నాగమణి, బి.ఉష, ఆశా కార్యకర్తలు బి.విజయలక్ష్మి, బి.పద్మ ,బి.సుశీల, ఏ మన్నీ తదితరులు పాల్గొన్నారు.