ఖమ్మం రూరల్, డిసెంబర్ 17 : మున్సిపల్ కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్ లోని టి సి వి ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ కార్మికులు, ఆయా విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కమిషనర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 186 మంది పారిశుధ్య కార్మికులు నిత్యం సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే కార్మికుల ఆరోగ్య భద్రతకుగాను ఈఎస్ఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. తద్వారా ఈఎస్ఐ హాస్పిటల్ తో పాటు ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత సేవలు పొందవచ్చన్నారు. ఈ సౌకర్యాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కార్మికుల ఆర్థిక భద్రత నిమిత్తం పీఎఫ్ సౌకర్యం సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్మికులు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పారిశుధ్య చెత్త సేకరణ విధుల్లో మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో అధికారులతో పాటు కార్మికుల పాత్ర చాలా కీలకమన్నారు. ఇంటి పన్నులు 100కు 100 శాతం వసూలు చేస్తేనే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సుందర మున్సిపాలిటీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్మికులు, అధికారులు సమన్వయంతో మెలిగి మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు శ్రీధర్ రెడ్డి, ఉమా, శ్రీనివాస్, కిరణ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, అకౌంట్స్ విభాగానికి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.

Khammam Rural : మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు : ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి