అశ్వారావుపేట, జూలై 15 : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) గడువును కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీఐ) పెంచడంతో ఇటు ఓటర్లకు, అటు అధికారులకు పెద్ద ఉపశమనం లభించింది. గడువు పెంపు కోసం బీఆర్ఎస్ నాయకత్వం ఢిల్లీ స్థాయిలో చేసిన కృషి ఫలించినట్లయింది. దీంతో భద్రాద్రి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ మరికొంత పారదర్శకంగా, తప్పులు లేకుండా జరిగేందుకు వీలు కలిగే అవకాశం ఏర్పడింది.
మునుపటి మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 24నే రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో గణన ఫారాల డిజిటలైజేషన్ ముగియాల్సి ఉంది. అయితే, భద్రాద్రి జిల్లాలో ఈ నెల 14 వరకు 52.79 శాతమే ఎన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ పూర్తికావడం, ఇంకా 47.21 శాతం గణన పత్రాల డిజిటలైజేషన్ పూర్తి కావాల్సి ఉండడం వంటి కారణాలతో బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఓటర్ల నుంచి గణన పత్రాలను స్వీకరించడం, ఓటర్లు ఆ పత్రాలను పూరించలేని పక్షంలో బీఎల్వోలే మరికొంత సమయం తీసుకొని వాటిని పూరించడం, ఆ తరువాత వాటిని ఆన్లైన్ చేయడం వంటి పనులతో వారిపై పనిభారం బాగా పెరిగింది. దీంతో వారు రేయింబవళ్లూ పనిచేయాల్సి వస్తోంది. ఒత్తిడి నేపథ్యంలో ఓటర్ల జాబితా కూడా సమగ్రంగా ఉండే అవకాశం లేదు. ఈ కారణాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో సర్ గడువు పెంచాలని ఢిల్లీ స్థాయిలో పోరాడింది. ఆ కృషి ఫలితంగా బుధవారం ఈసీఐ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

ఆగస్టు 3 వరకూ డిజిటలైజేషన్‌కు గడువు పెంచింది. భద్రాద్రి జిల్లాలో జూన్ 25న ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ కార్యక్రమం అధికారులకు ప్రహాసనంలా మారింది. పత్రాల పంపిణీ లక్ష్యాన్ని ఎట్టకేలకు చేరుకున్నప్పటికీ డిజిటలైజేషన్లో మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. మొదటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24తోనే సర్ ప్రక్రియలో ఫారాల ఆన్లైన్ పూర్తికావాల్సి ఉంది. ఈ దశలో అధికారులు, బీఎల్వోలు పగలూ, రాత్రీ పనిచేస్తున్నా ఈ నెల 14 నాటికి భద్రాద్రి జిల్లాలో కేవలం 52.79 శాతమే డిజిటలైజేషన్ పూర్తయింది.
మిగిలిన 8 రోజుల్లో 47.21 శాతం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. కేవలం ఎనిమిది రోజుల్లో ఈ ప్రక్రియ ఎలా పూర్తిచేయాలంటూ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో బీఆర్ఎస్ కృషి ఫలితంగా ఎస్ఐఆర్ గడువును ఈసీఐ పొడిగించింది. ఇప్పటి వరకూ జరిగిన గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియలో పాల్గొనడం, పత్రాలు పూరించే అంశంపై ఓటర్లకు అవగాహన కల్పిండచం వంటి కారణాలతో కొంతమేరకు వేగిరమైంది.
భద్రాద్రి జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 14 నాటికి 52.79 శాతమే పూర్తయింది. ఇంకా 47.21 శాతం మిగిలి ఉంది. ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ అశ్వారావుపేట నియోజకవర్గంలో అత్యల్పంగా, భద్రాచలం నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియపై అశ్వారావుపేటలో బుధవారం సమీక్షించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్.. ప్రక్రియ మందకొడిగా సాగుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగం పెంచాలని ఆదేశించారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాలున్నాయి. 9,96,198 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరికీ బీఎల్వోలు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ మాత్రం 5,03,353 మంది ఓటర్ల పత్రాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,92,845 మంది ఓటర్ల పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సమయం దగ్గర పడుతోందంటూ బీఎల్వోలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీఎల్వోలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించేందుకు సమయం సరిపోకపోవడంతో కొన్ని చోట్ల బీఎల్వోలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించి డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీంతో ఓటర్లు తమ పత్రాలను తీసుకొని ప్రత్యేక శిబిరాలకు పరుగులు తీస్తున్నారు. గణన పత్రాలు అందించకుంటే తమ ఓటు హక్కు పోతుందోనన్న ఆందోళనతో చాలామంది ఓటర్లు ప్రత్యేక శిబిరాలకు పరుగులు తీస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఓటర్ల చిరునామాలను గుర్తించడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. అయినా ప్రతి ఓటరుకూ వారి గణన పత్రాలను అందించాం. డిజిటలైజేషన్ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాం. బీఎల్వోలు పగలూ రాత్రీ పని చేస్తున్నారు. ఓటర్లందరూ తమ గణన పత్రాలను బీఎల్వోలకు తప్పనిసరిగా అందించాలి.
-దాసరి కిశోర్, తహసీల్దార్, అశ్వారావుపేట
