పేదలకు అండగా నిలవాల్సిన సర్కారు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు మృగ్యమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. జిల్లా మాతాశిశు ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ‘పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా మాకేంటి?’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించేవారు. ప్రత్యేక ప్రోత్సాహకాలూ ఇచ్చేవారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.వేలకు రూ.వేలు నష్టపోకుండా ప్రభుత్వ ఆసుప్రతుల్లోనే సకల సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు, సాధారణ కాన్పులు చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడారు. ఇంకా ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల చొప్పున రెండు కాన్పుల వరకూ ప్రోత్సాహకాలు అందించేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇవేమీ కనిపించడం లేదు. దీంతో పేద గర్భిణుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)
ఈమె పేరు మాదాసి సరిత. సింగరేణి ప్రాంతం రుద్రంపూర్ వాసి. పురిటినొప్పులతో రామవరంలోని మాతాశిశు జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేదని, ఏదైనా జరిగితే తామేం చేయలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీలేక ఆమె భర్త వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ సిజేరియన్ చేసి వైద్యులు కాన్పు చేశారు. 12 రోజుల తర్వాత సొంత డబ్బులు పెట్టుకుని అంబులెన్స్‌లో ఇంటికి చేరారు. ఇదీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక నిరుపేద గర్భిణి గాథ.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఎటువంటి ప్రోత్సాహకాలూ ఉండడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో గర్భిణి ఆసుపత్రికి వెళ్తే సకల సౌకర్యాలు కల్పించేవారు. సాధ్యమైనంత వరకూ సాధారణ ప్రసవాలనే సాధారణ ప్రసవాలనే ప్రోత్సహించే వారు. రెండుసార్లు న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చూసేవారు. ఆసుపత్రిలో కాన్పు చేసుకుంటే కేసీఆర్ కిట్‌తోపాటు ఆడపిల్లకు రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12 వేల చొప్పున ఇచ్చి పంపేవారు. గతంలో అమ్మఒడి వాహనాల్లో గర్భిణులను తీసుకువెళ్లి పరీక్షలు చేయించి ఇంటికి తీసుకొచ్చేవారు. దీంతో పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితులేమీ లేవు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే కోత ఆపరేషన్లు చేస్తున్నారు. తక్కువలో తక్కువ రూ.40 వేల వరకు ఫీజుల వసూలు చేస్తున్నారు.
పెరిగిన సిజేరియన్లు..
ప్రభుత్వాసుపత్రులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇటు సర్కారు వైద్యశాలల్లోనూ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు గణనీయంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తామంటూ తొలుత ప్రైవేటు ఆసుపత్రులు చెబుతున్నప్పటికీ చివరకు కోతలు కోసి బిడ్డలను బయటకు తీయడాన్ని అలవాటుగా మార్చుకున్నాయి. దీంతో పేదవాళ్లు ఆసుపత్రులకు డబ్బులు పొయ్యలేక అప్పుల పాలవుతున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా గత ఏడాది (2023) ప్రభుత్వాసుపత్రుల్లో కోత ఆపరేషన్లు 3,662, ప్రైవేటులో 2,908 చేసినట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది (2024)లో 17,294 మంది గర్భిణులు నమోదయ్యారు. వీరిలో 4,626 మంది గర్భిణులు బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 4,860 మందికి సాధారణ ప్రసవాలు చేశారు. 3,662 మందికి సిజేరియన్లు (కోత ఆపరేషన్లు) చేశారు. విచిత్రమేమిటంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో 931 మందికి నార్మల్ డెలివరీలు కాగా 2,908 మందికి సిజేరియన్లు చేశారు. దీంతో మొత్తంగా కోత ఆపరేషన్లే ఎక్కువగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.
ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేసుకున్నాను..
ప్రభుత్వాసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. రక్త పరీక్షల కోసం మాతాశిశు ఆసుపత్రి నుంచి కొత్తగూడెం రావాలి. అత్యవసరమైతే అక్కడ వెంటిలేటర్ లేదు. బయటకు వెళ్లాలంటే అంబులెన్స్ కూడా ఇవ్వరు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. రూ.20 వేలు అయ్యాయి. మొదటి పాపకు కేసీఆర్ కిట్టు రూ.13 వేలు ఇచ్చారు. రెండో బిడ్డకు ఏమీ లేవు. గత కేసీఆర్ పాలనలోనే గర్భిణులకు మంచి సౌకర్యాలున్నాయి.
సాధారణ ప్రసవాలే చేస్తున్నాం..
ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ మందికి సాధారణ ప్రసవాలే చేస్తున్నాం. ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారికి ఆపరేషన్లు తప్పడం లేదు. ప్రైవేటులో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నట్లు తెలిసింది. వాళ్లకు కూడా చెబుతున్నాం. గర్భిణులు తమంతట తామే సిజేరియన్లు చేయించుకుంటున్నారని ప్రైవేటు ఆసుపత్రులు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో కిట్లు వచ్చాయి. వాటిని గర్భిణులకు ఇచ్చాము. ఇప్పుడు కూడా వస్తే ఇస్తాం. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం.
– డాక్టర్ భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో, కొత్తగూడెం