భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వానొచ్చి వరదొస్తే ప్రజలు ఏటా విలవిల. పెట్టేబేడా సర్దుకొని రోజులతరబడి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం పరిపాటి. అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల ఉండే గిరిజన ప్రాంతాలు. పోలవరం పేరుతో ఉన్న మూడు మండలాలను ఆంధ్రాలోకి విలీనం చేయడంతో నియోజకవర్గం చిన్నాభిన్నం. చెంతనే గోదావరి ఉన్నా తాగునీటికి తండ్లాటే. చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు ప్రాంత ప్రజలకు చెలమ నీరే దిక్కు. ఇదంతా ఉమ్మడి పాలనలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే. అయితే 2014 తర్వాత భద్రాచలం రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ సిద్ధించడంతోనే భద్రగిరికి కొత్త రూపొచ్చింది. రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా తెలంగాణ సర్కారు ముంపు బాధితులను ఆదుకోవడంలో ముందున్నది. ప్రాణనష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరదల్లోనే భద్రాచలం వచ్చి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చడంతోపాటు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాలు బిగించి సమస్యను తీర్చారు. భద్రాచలం పరిధిలో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం చేరవేయడంలో సత్ఫలితాలను సాధించింది. రైతుబీమా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, ట్రైకార్, గిరివికాస్ వంటి పథకాలను ప్రజలకు చేరువ చేసింది. దీంతో మన్యంలో ఉన్న గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా జీవనం గడుపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్ల వ్యయంతో డయాలసిస్ యూనిట్‌ను భద్రాచలంలో ఏర్పాటు చేసింది. 10 సిట్టింగ్‌లు ఒకసారే జరిగేలా ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1,200 సార్టు డయాలసిస్ చేశారు. 120 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రూ.2.80 కోట్ల వ్యయంతో దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం-గౌరారం గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో 15 గ్రామాల ప్రజల రాకపోకల సమస్యకు పరిష్కారం లభించింది. వంతెన నిర్మాణంతో ప్రజల కష్టాలు తీరిపోయాయి.
గ్రామాల్లోని గల్లీ రోడ్లు సీసీ రహదారులుగా మారాయి. భద్రాచలం పట్టణ పరిధిలోని కాలనీలకు నాడు రహదారి సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు వేశారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా 197 పనులకు రూ.9 కోట్లు, పీఆర్ ద్వారా 70 పనులకు రూ.30 కోట్ల నిధులు రెండేళ్లలో విడుదల చేశారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఇప్పటివరకు రూ.500 కోట్ల నిధులతో కల్వర్టులు, రహదారులు నిర్మించారు.
భద్రాచలం పట్టణంలో ఇంటింటికీ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించింది. భద్రాచలంలోని రెండు ఆవాసాలకు రూ.12.44 లక్షలు, చర్ల మండలానికి 105 గ్రామాలకు రూ.20.18 లక్షలు, దుమ్ముగూడెం మండలానికి 108 గ్రామాలకు రూ.18.8 లక్షల నిధులను మంజూరు చేసి 453 కిలోమీటర్ల పొడవున పైపులైన్లు వేశారు. మొత్తం 37,890 నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు పథకం కింద ఒక్కొక్కరికి రూ.పది లక్షల చొప్పున సాయం అందజేశారు. దీంతో లబ్ధిదారులు మినీ ట్రాలీలు, కార్పెంటర్ షాపులు, టెంట్ హౌస్‌లు, డీజే సౌండ్ సిస్టమ్‌లు, బియ్యం, సెంట్రింగ్ షాపులు, ఆటోమోబైల్, విద్యుత్ పరికరాల షాపులు పెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు.
భద్రాచలం ఆస్పత్రి అంటేనే రెండు రాష్ర్టాల ప్రజలను ఆదుకునే పెద్దాస్పత్రి. ఏరియా ఆస్పత్రిగా ఉన్న భద్రాచలం ఆస్పత్రిని కమ్యూనిటీ ఆస్పత్రిగా మార్చారు. గత ప్రభుత్వాల హయాంలో బోసిపోయిన ఆస్పత్రికి తెలంగాణ సర్కారు కొత్త రూపును తీసుకొచ్చింది. దీంతో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణ ప్రజలకు వైద్యం మరింత చేరువైంది. అక్కడి వైద్యులు సుఖ ప్రసవాలతోపాటు సర్జరీలు విజయవంతంగా చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో కలిసిన గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక గ్రామాలతోపాటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి ఎంతో మంది ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. అదే ప్రాంతంలో జిల్లాకే తలమానికంగా టీబీ యూనిట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నారు.
ఆదివాసీలు నివసించే ప్రాంతాలకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. దీంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలో మరో ముందడుగు వేశాయి. గిరిజన నిరుద్యోగులకు ట్రైకార్ రుణాల ద్వారా సొంత వాహనాలు, గిరివికాస్ ద్వారా పంట పొలాల్లో బోర్లు వేసి సాగు రంగానికి చేయూతనిస్తోంది. రూ.26.10 కోట్లతో వంద శాతం సబ్సిడీతో 2,710 మంది రైతులకు 8,603 ఎకరాల భూమిని సాగుకు చేరువ చేసింది. సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో ఇబ్బంది పడుతున్న 250 గ్రామాల గిరిజనులకు త్రీఫేజ్ సౌకర్యాన్ని కల్పించింది. 2021 నుంచి 2023 వరకు రూ.10 కోట్లతో సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులను కేటాయించింది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు మిల్లెట్ తయారీ కేంద్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం దుమ్ముగూడెం వద్ద సీతమ్మ బరాజ్ నిర్మాణానికి రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించగా.. పనులు చకచకా సాగుతున్నాయి. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్నారు. దీంతో అతి తక్కువ ఖర్చుతో జల విద్యుత్ తయారీతోపాటు ఎగువ ప్రాంతాలకు గోదావరి నీటిని అందించనున్నారు. బరాజ్ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో గోదావరి నదిపై రెండో జలాశయం కానున్నది. నీటి నిల్వ సామర్థ్యంతో మణుగూరు, పినపాక, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల మండలాలతోపాటు ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట తదితర మండలాల్లో భూగర్భ జలాలు పెరగనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజక్టు ద్వారా ఉభయ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనికితోడు నియోజకవర్గంలోని ప్రగళ్లపల్లి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.650 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పథకం ప్రారంభమైతే మరో 2 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
మన్యంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోంది. ఏటా వచ్చే గోదావరి వరదలను ఎదుర్కొన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషివల్లే సాధ్యమైంది. ముంపు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇస్తున్నాం. ట్రైకార్ ద్వారా వేలాది మంది గిరిజనులకు లబ్ధి చేకూరింది.