మామిళ్లగూడెం, జూన్ 23: ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు విసృ్తతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒకటైతే మరొకటి ర్యాష్ డ్రైవింగ్ అని గుర్తించారు. మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రం గా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజు నగరంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 225 మైనర్, 4094 ర్యాష్, స్పీడ్ డ్రైవింగ్, 661 డ్రంకన్ డ్రైవ్, 881 రాంగ్ సైడ్ డ్రైవింగ్, 1087 నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు, 993 త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదు చేశారు. ఇకనైనా తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నారు. మైనర్ డ్రై వింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు అంటున్నారు. ఇకపై ధ్వని కాలుష్యాన్ని కల్గించే వాహనాన్ని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లైసెన్సు, నంబర్ ప్లేట్ నంబర్ సక్రమంగా లేని, నంబర్ ట్యాంపరింగ్ కలిగిన, నంబర్ తుడిపి వేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన వాహనాలపై ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు.
ఖమ్మం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు కాంటాక్ట్ కేసులు : 2641 నమోదు చేసి రూ.20,96,500 జరిమానా విధించారు. నాన్ కాంటాక్ట్, కెమెరా కేసులు 32122 నమోదు చేసి రూ.76,69,370 ఫైన్ వేశారు. రహదారుల్లో లేజర్ గన్ ద్వారా 4093 కేసులు నమోదు చేసి రూ.42,362,55 విధించారు. క్రేన్ ద్వారా వాహనాలు రికవరీ చేసి 1358 కేసులకు రూ. 4,38,200, సీసీ కెమెరాల ఇంటిలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా 3583 కేసులు పెట్టి, రూ. 4,38,200 ఫైన్ విధించారు. అతివేగంగా నడిపిన 4094 కేసులు పెట్టి రూ.40,94,000 జరిమానా వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 661, మైనర్ డ్రైవింగ్ కేసులు 225 రూ.1,12,500 ఫైన్ విధించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినందుకు 547 కేసులు పెట్టి రూ.5,47,000 విధించారు. సిగ్నల్ జంపింగ్ 287 కేసులు, రూ.2,87,000 ఫైన్ విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు 28,088 కేసులు పెట్టి రూ.41,96,700 ఫైన్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వాహనం నడిపి నందుకు నడిపినందుకు 881 కేసులు నమోదు చేసి రూ.2,00,200, త్రిబుల్ రైడింగ్ 993 కేసులు రూ.1,12,6800 జరిమానా విధించారు. విపరీతమైన శబ్దాలు చేస్తూ తిరిగే 80 బుల్లెట్ వాహనాల యొక సైలెన్సర్స్ తొలగించారు. వాహనంపై నెంబర్ ప్లేట్ సరిగాలేని 1087 వాహనాలపై రూ.2,17,400 ఫైన్ వేశారు.
ఖమ్మం నగరంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇక నుంచి మైనర్లు వాహనం నడుపుతూ పట్టు బడితే, నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా వాహనం నడిపితే కోర్ట్‌కు పంపిస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలి.