భద్రాచలం, జనవరి 8 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండు రోజులపాటు జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్‌రాజు అన్నారు. భద్రాచలం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సెక్టార్ల వారీగా అధికారులు తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం ప్రదేశాల్లో విధులు నిర్వర్తించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముక్కోటి కోసం 1,300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేయడంతోపాటు రెండు రోజులు భద్రాచలంలో జరిగే వేడుకలకు పోలీసులు విధించే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, మణుగూరు డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐ సంజీవరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.