కారేపల్లి, మార్చి 25 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నాడని ఆరోపిస్తూ స్థానికులు సర్పంచ్ ఉండం రాఘవులుతో కలిసి లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ ఆహార ధాన్యం గోదాము నిర్మాణం కోసం అధికారులు స్థలాన్ని కేటాయించారని చెబుతూ సంబంధిత కాంట్రాక్టర్ విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు. కాంట్రాక్టర్ గుట్టపై ఉన్న పచ్చని చెట్లను విధ్వంసం చేస్తున్నారన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇక్కడ ఎటువంటి ఎన్ఎస్పీ గోడౌన్ మంజూరు కాలేదని వేరే ప్రదేశంలో స్థలం కేటాయిస్తే ఇక్కడ మట్టిని తవ్వుతున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా నిరంతరాయంగా మట్టి తోలకాల లారీల రాకపోకలతో పర్యావరణం కలుషితమై పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందిని తలపెట్టి కాంట్రాక్టర్, అధికారులకు లాభం చేకూర్చే పనులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఈసం లక్ష్మీనరసు, ఉండం నవీన్, చేల అంజయ్య, ఈసం పాపయ్య, ఈసం సుధాకర్, కోటయ్య,రమేశ్, సోమయ్య, కుంజ రాములు, సంజీవరావు, వినోద్ పాల్గొన్నారు.

గుట్టకిందగుంపులో ఆగని మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్తులు