ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 14: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకంతో ఆనందం కలగడంతోపాటు కాస్త ఆరోగ్యమూ పదిలపడుతోంది పండుటాకులకు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రూ.75, రూ.200గా ఉన్న పింఛన్‌ను తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అనేక రెట్లు పెంచి రూ.2,016, రూ.3,016 చొప్పున అందిస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయి. అయితే ఇప్పటి వరకూ పింఛన్లు పొందుతున్న వారితోపాటు కొత్తగా 57 ఏళ్లు దాటిన వారికి కూడా నూతన పింఛన్లు మంజూరు చేయడంతో వారు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ నూతన పింఛన్లు మంజూరు చేయడం.. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను పంపిణీ చేస్తుండడం వంటి కారణాలతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
నూతన పింఛన్లు ఇలా..
ఇల్లెందు పట్టణంలో గతంలో 4489 మందికి రూ.1.15 కోట్ల పింఛన్ సొమ్ము అందేది. ఇప్పుడు కొత్తగా మరో 896 మందికి పింఛన్లు మంజూరు కావడంతో వారికి సుమారు రూ.19.27 లక్షల పింఛన్ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఇక ఇల్లెందు మండలంలో ఇప్పటి వరకూ 9500 మందికి పింఛన్లు అందుతుండగా.. వారికి రూ.2.40 కోట్లు జమ అయ్యేవి. ఇప్పుడు కొత్తగా 1541 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో వారికి సుమారు రూ.40 లక్షల వరకూ పింఛన్ సొమ్ము జమ కానుంది. వృద్ధాప్యం, వైకల్యం వంటి సమస్యలతో బాధపడుతున్న తమకు సీఎం కేసీఆర్ ఆర్థికంగా అండగా నిలుస్తుండడంతో బతుకుపై భరోసా కలుగుతోందంటూ మరోధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పింఛన్‌తో ధైర్యంగా బతుకుతున్నా..
భర్తలేని మా లాంటి వితంతువులకు సీఎం కేసీఆర్ పెద్దన్నయ్యలా అండగా ఉంటున్నారు. నెలనెలా ఆయన ఇచ్చే పింఛన్‌తో ధైర్యంగా బతుకున్నా. పింఛన్ సొమ్ము అందగానే ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నా. ప్రతి నెలా రేషన్ బియ్యంతోపాటు ఆసరా పింఛన్‌ను కూడా తీసుకొని వెళ్తుంటారు. ఎవరి వద్దా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా జీవిస్తున్నా.
-పూనెం పాపమ్మ, విజయలక్ష్మీనగర్, ఇల్లెందు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
గత ప్రభుత్వాలు ఇచ్చిన పింఛన్‌తో కనీస అవసరాలు కూడా తీరేవికావు. కనీసం ఆసుపత్రి మందులు కొందామన్నా సరిపోయేవి కావు. కానీ తెలంగాణ ఆవిర్భవించి సీఎంగా కేసీఆర్ వచ్చాక పింఛన్‌ను చాలా రెట్లు పెంచారు. ఇప్పుడొస్తున్న పింఛన్‌తో అన్ని అవసరాలూ తీరుతున్నాయి. ఎవరి దగ్గరా చేయి చాచకుండా బతకుతున్నాం. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-ధనసరి నాగమ్మ, మొండితోగు, ఇల్లెందు.
కేసీఆరే మా ధైర్యం
వికలాంగులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ధైర్యం. చాలీచాలని పింఛన్‌తో ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం ప్రతినెలా ఆసరా పింఛన్ సొమ్ము నా బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో కనీస అ వసరాలన్నింటిని ఒడ్డెకించుకోగలు గుతు న్నా. ఇంతగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ మాలాంటి వారికి దేవుడితో సమా నం. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
-బానోత్ హరిసింగ్‌నాయక్, విజయలక్ష్మీనగర్, ఇల్లెందు