బూర్గంపహాడ్, జూన్ 9 : భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జిపై నిర్మించిన కొత్త వారధి మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో సారపాక- భద్రాచలం మధ్యలో ఉన్న గోదావరి నదిపై రూ.కోట్లతో నిర్మించిన కొత్త వారధి అప్రోచ్ కుంగి ఊడిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే వినియోగంలోకి వచ్చిన ఈ వంతెన అప్రోచ్ నెలరోజుల క్రితం కుంగి రాత్రికిరాత్రే ఊడిపోవడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రాకపోకలు నిలిపివేశారు. అయితే మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సిన అధికారులు తీవ్ర జాప్యం చేస్తుండడంతో వాహనదారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా జరుగుతున్న అప్రోచ్, సైడ్బర్మ్ పనుల్లో నాణ్యత కూడా పాటించడంలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కొత్త వారధిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేసినప్పటికీ సరైన సూచికలు రహదారిపై ఉంచకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు వాహనాలు అటువైపు వెళ్లకుండా ప్రమాద సూచికలు పెట్టి పర్యవేక్షణ చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
భద్రాద్రి నూతన వంతెన అప్రోచ్, సైడ్బర్మ్ పనుల్లో ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని పలువురు మండిపడుతున్నారు. పదికాలాలపాటు ఉండాల్సిన నూతన బ్రిడ్జి నిర్మాణ విషయంలో ఆది నుంచి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనులను పర్యవేక్షించడం లేదని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు. ఆ సంఘటన జరిగిన కొన్నినెలలకే వంతెన అప్రోచ్ కుంగిపోవడం గమనార్హం. మరమ్మతు పనులు ప్రారంభమై నెలరోజులైనా ముందుకు సాగకపోవడంపై ఇటు వాహనదారులు… రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది గోదావరి వరదలు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వస్తుంటాయి. భద్రాచలం- సారపాక నూతన వంతెన అప్రోచ్ పనులు నత్తనడకన సాగుతుండటంతో గోదావరికి వరదలొస్తే కోట్ల రూపాయల నిధులు నీళ్లపాలయ్యే ప్రమాదం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వరదలొస్తాయని తెలిసినా ఎన్హెచ్ అధికారులు గుత్తేదారులతో మరమ్మతు పనులను త్వరితగతిన చేపట్టకుండా జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొత్త వారధిపై వాహన రాకపోకలు జరగకపోయినా రాత్రిళ్లు హైమాస్ లైట్ల వెలుగులు ఉంటున్నాయని… పాత వారధిపై కొన్ని లైట్లు వెలగడంలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారధిపై లైట్లు వెలగకుండా చూసి, పాత వారధిపై పూర్థిస్థాయిలో లైట్లు వెలిగేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అప్రోచ్ పనుల్లో నాణ్యత పాటించేలా పర్యవేక్షించాలని, త్వరగా రాకపోకలు సాగేలా చూడాలని వాహనదారులు, భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.