ఖమ్మం అర్బన్, మార్చి 7: పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చకచకా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో కనిష్టంగా 11 నుంచి 14 మంది వరకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేషన్ విధులు కేటాయించారు. ఇన్విజిలేటర్లకు ఈ నెల 11, 12వ తేదీల్లో ఉత్తర్వులు అందజేయనున్నారు. ఇన్విజిలేషన్ చేసే ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు మినహా సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను భాగస్వాములను చేశారు. మొత్తం 1,585 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. వీరిని రెండు స్పెల్స్‌లో వినియోగించనున్నారు.
పకడ్బందీగా నిర్వహించే ప్రక్రియలో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ల పరీక్షలు జరుగుతున్న సమయంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్ట్‌లను బోధించే ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రం పరీక్షలు జరిగే సమయంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లు బోధించే ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించేలా తేదీలు పొందుపరుస్తూ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. లాంగ్వేజెస్ పరీక్షలకు నాన్ లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు, నాన్ లాంగ్వేజెస్ పరీక్షలకు లాంగ్వేజెస్ ఉపాధ్యాయులను ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కేటాయిస్తూ ఉత్తర్వులు సిద్ధం చేశారు.
ఖమ్మం జిల్లాలో 424 స్కూల్స్ నుంచి 16,417 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 97 పరీక్షా కేంద్రాలు కేటాయించగా ఒక్కో సెంటర్‌కు ఒక్కో సిట్టింగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సిట్టింగ్ స్కాడ్లుగా విద్యాశాఖకు సంబంధంలేని ఇతర విభాగాల నుంచి కలెక్టర్ కేటాయించనున్నారు.
ప్రశ్నపత్రాలు ఒక సెట్ జిల్లాకు గురువారం చేరుకోగా 23 స్టోరేజ్ పాయింట్లగా ఉన్న ఆయా పోలీస్స్టేషన్ల్లో భద్రపరిచారు. ప్రశ్నపత్రం ఇంకో సెట్ రెండు మూడ్రోజుల్లో రానుంది. వీటిని డీఈవో సోమశేఖరశర్మ, పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
పీహెచ్ కేటగిరీ-1, కేటగిరీ-2లో నిబంధన మేరకు విద్యార్థులు కొందరు తమకు సహాయకులుగా ఇతర విద్యార్థులను అందించాలని దరఖాస్తు చేసుకున్నారు. పదో తరగతి పరీక్షలకు ఇలా 65 మందికి సంబంధించిన వివరాలు విద్యాశాఖ కమిషనర్ ఆమోదించి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపారు. చెవిటి, మూగ, అంధ కేటగిరీలలో విద్యార్థులకు అవకాశం కల్పించారు. సహాయక విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతుండడంతోపాటు పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు బోనఫైడ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది.