కారేపల్లి, డిసెంబర్ 23 : కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలో విధుల్లో ఉన్న వర్కర్ బచ్చల దశరథపై మంగళవారం దాడి జరిగింది. సీతారాంపురం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి బచ్చల దశరథ ఓటు వేయలేదని, గ్రామంలో ఎవ్వరిని ఓటు వేయకుండా చేశారని ఆరోపిస్తూ దశరథపై దాడి చేశారు. దీనిని నిరసిస్తూ గ్రామ పంచాయతీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కారేపల్లి ఎస్ఐ బైరు గోపీ, ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. విధుల్లో ఉన్న జీపీ వర్కర్‌పై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ కారేపల్లి మండల కన్వీనర్ కె.నరేంద్ర, పంచాయతీ వర్కర్స్ జిల్లా కార్యదర్శి ఎస్కె.హుస్సేన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నికల విధుల్లో పని చేశారన్నారు. 41 గ్రామ పంచాయతీల్లో 132 మంది వర్కర్లు పని చేయగా కేవలం 40 మందికి మాత్రమే ఎన్నికల రెమ్యూనరేషన్ ఇచ్చారన్నారు. ఎన్నికల పైకాన్ని మండలంలో 132 మంది గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావు, కొమరయ్య, యూనియన్ కోశాధికారి శ్రీను, పాలిక తిరపయ్య, ఉపేందర్, మోతిలాల్, మోహన్, దశరథ కుమార్, హేమ్‌చంద్, సుక్యా, బి.రమేశ్ పాల్గొన్నారు.