భద్రాచలం/ పర్ణశాల, డిసెంబర్ 22: భద్రాచలం, పర్ణశాలల్లోని సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు (పగల్ పత్తు) వైభవంగా ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా తొలిరోజు రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీహరి ధరించిన దశావతారాల్లో మొట్టమొదటి అవతారం ‘మత్స్యావతారం’. ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు అంతరాలయంలో స్వామివారికి ఆరాధన, నివేదన తదితర నిత్య పూజలను నిర్వహిస్తారు. 5 గంటలకు స్వామివారిని, కణ్ణన్, ఆండాళ్ తల్లిని ఉంచి ప్రత్యేక అభిషేక తిరుమంజనం గావిస్తారు.
ఆండాళ్ అమ్మవారికి విశేష పాశురం విన్నవించి, అనంతరం 30 పాశురాలను విన్నవిస్తారు. తరువాత అమ్మవారికి మంగళశాసనం, గోష్టి నిర్వహించి తాతగుడిసెంటర్ వరకు తిరువీధి సేవ జరుపుతారు. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:10 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయరు. ఈ రోజు నుంచి జనవరి రెండు వరకు రామయ్యకు నిత్య కల్యాణాలను నిలిపివేస్తారు. ఉదయం 10:30 గంటలకు ‘తొళక్కం’తో అధ్యయనోత్సవాలు ప్రారంభిస్తారు. దేవస్థానం ఈవో దంపతులు జ్యోతి ప్రజ్వలనతో అధ్యయనోత్సవాలను మొదలు పెడతారు.
అంతరాలయంలోని స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన జరుపుతారు. బేడా మండపంలో ఉన్న ఉత్సవమూర్తులకు, పన్నిద్ధారాళ్వార్లకు, దేవస్థానం స్థానాచార్యుల వారికి పరివట్టం కట్టి ఆలయ మర్యాదలు సమర్పించి శఠారితో పంచముద్రలు సమర్పిస్తారు. అనంతరం ‘నాలాయిర దివ్య ప్రబంధాన్ని’ పఠిస్తారు. అనంతరం ప్రాకార మండపంలో ఉన్న యాగవీరమూర్తులకు ‘మత్స్యావతారం’ అలంకరించి మహానివేదన చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు స్వామివారిని గోదావరి ఒడ్డుకు తీసుకొని వెళ్లి అక్కడి నుంచి భక్తుల దర్శనార్థం మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆసీనులను చేస్తారు.
సాయంత్రం 4 గంటలకు రాజవీధిలో ఉన్న విశ్రాంత మండపం వద్దకు స్వామివారిని తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. 4:30 గంటలకు అక్కడి నుంచి తాతగుడి సెంటర్ వద్దకు సకల రాజ లాంఛనాలతో బయలు దేరి వెళ్లి భక్తులను అనుగ్రహిస్తారు. తరువాత ఆలయానికి స్వామివారు చేరుకుంటారు. అక్కడ ప్రాకార మండపంలో తిరుప్పావై కాలక్షేపం వనం వెంకట వర ప్రసాద్‌తో తిరుప్పావై ప్రవచనం జరుపుతారు. స్వామివారికి అంతరాలయంలో సేవాకాలం నిర్వహిస్తారు.
పర్ణశాలలోనూ..
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో శుక్రవారం నుంచి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని అర్చకులు కిరణ్కుమార్చార్యులు, భార్గవాచార్యులు గురువారం తెలిపారు. మొదటగా శుక్రవారం మత్స్యావతారం, శనివారం కూర్మావతారం, ఆదివారం వరాహావతారం, సోమవారం నృసింహావతారం, మంగళవారం వామనావతారం, బుధవారం పరశురామ అవతారం, గురువారం శ్రీరామ అవతారం, శుక్రవారం బలరామ అవతారం, శనివారం శ్రీకృష్ణ అవతారాల్లో స్వామివారు దర్శనమివ్వనున్నట్లు వివరించారు.
జనవరి 1న సాయంత్రం పవిత్ర గోదావరిలో జరిగే తెప్పోత్సవంతో పగల్‌పత్తు కార్యక్రమం సమాప్తమవుతుందని చెప్పారు. జనవరి 2న తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో ఉత్తరద్వార దర్శనం నిర్వహించనున్నట్లు తెలిపారు.