సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భద్రాద్రి జిల్లా రైతులకే ముందుగా అందించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఏజెన్సీ రైతులకు నీళ్లివ్వకుండా పొరుగు జిల్లాలకు తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని, మరో ఉద్యమానికి సిద్ధమవుతాయని స్పష్టం చేశారు. సీతారామ జలాలను మొదటగా భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ శ్రేణులు సోమవారం కదం తొక్కాయి.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని తహసీల్ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. కొన్ని మండలాల్లో నిరసన ర్యాలీలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఆయా మండలాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తలాపునే ఉన్న గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారని అన్నారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై సీతారామ ప్రాజెక్టును, సీతమ్మ బరాజ్‌ను ప్రారంభించారని అన్నారు. సుమారు రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును 90 శాతం నిర్మించారని గుర్తుచేశారు. ఇంతలో వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. సీతారామ ప్రాజెక్టు ఫలాలు భద్రాద్రి జిల్లాకు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సీతారామ జలాలను మొదటగా భద్రాద్రి జిల్లాకు అందించకుండా తమ జిల్లాలకు తీసుకెళ్లాలని చూస్తున్నారని విమర్శించారు.
అలాగే, ఆరు గ్యారెంటీల పేరుతో భద్రాద్రి జిల్లా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి.. 18 నెలలు దాటినా వాటి ఊసు ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సీతారామ జలాలను మొదటగా భద్రాద్రి జిల్లాకు ఇవ్వకున్నా, ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
-నమస్తే నెట్వర్క్, జూన్ 9