ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు అప్పట్లో పరుగులు పెట్టినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పనులు ముందుకు కదలడం లేదు. పూర్తయిన పనులకు కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం, కాల్వల కోసం ఇప్పటికీ కొన్నిచోట్ల భూములను కొనుగోలు చేయకపోవడంతో ఆ ప్రాంతాల్లో పనులే ప్రారంభంకాలేదు. కొద్దోగొప్పో జరుగుతున్న పనులు సైతం వేగంగా సాగడం లేదు. దీంతో సీతారామ ప్రాజెక్టు పనులు ఎప్పటికీ పూర్తయ్యి.. ఎప్పుడు సాగునీళ్లు వస్తాయో అర్థంకాక అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– తిరుమలాయపాలెం, నవంబర్ 20
ఉమ్మడి ఖమ్మంజిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదిపై బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం దుమ్ముగూడెం, అశ్వాపురం, మొండికుంట ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చాయి. కానీ.. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ హయాంలోనే పాలేరు లింక్ కెనాల్‌ను రూ.1,600 కోట్ల వ్యయంతో ఏన్కూరు 104.4 కిలోమీటరు వద్ద నుంచి పనులు ప్రారంభించారు. ఏన్కూరు నుంచి పాలేరు వరకు 76.92 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వకం పనులు పూర్తి చేయాల్సి ఉంది.
ఇందుకుగాను 2,606 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా.. గత కేసీఆర్ ప్రభుత్వం 758 ఎకరాల భూమి కొనుగోలును పూర్తి చేసింది. సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ 13, 14, 15, 16 ప్యాకేజీ పనులు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తవ్వకాలు జరిగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు జరగడం లేదు. పాలేరు లింక్ కెనాల్లో భాగంగా 13 ప్యాకేజీలో జూలూరుపాడు, డోర్నకల్ మండలాల్లో 10 కిలోమీటర్లు కాల్వ తవ్వకాలు చేయాల్సి ఉండగా.. ఇంకా టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు.
పనులు ప్రారంభమే కాలేదు. 14 ప్యాకేజీలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని మండలాల్లో 29 కిలోమీటర్లు కాల్వ తవ్వాల్సి ఉండగా.. గార్ల మండలం బుద్దారం వద్ద అర కిలోమీటరు కాల్వ మాత్రమే పూర్తి అయింది. 15 ప్యాకేజీలో 27 కిలోమీటర్లు కాల్వ తవ్వాల్సి ఉండగా.. 17 కిలోమీటర్లు మాత్రమే కాల్వ తవ్వకం జరిగింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 17 ప్యాకేజీలో నాలుగు కిలోమీటర్లు కాల్వ తవ్వకం చేయాల్సి ఉండగా.. మూడు కిలోమీటర్లు పూర్తి చేశారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు భూములు నష్టపోకుండా తిరుమలాయపాలెం మండలంలో ఎనిమిది కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా కాల్వ తవ్వకం పనులు మంజూరు చేయించారు. అట్టి పనులు కూడా ప్రస్తుతం వేగంగా సాగడం లేదు. కిలోమీటరున్నర మాత్రమే టన్నెల్ కాల్వ తవ్వకం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నవంబర్ వరకు టన్నెల్ పనులు పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. పాలేరు లింక్ కెనాల్ తవ్వకానికి ఇంకా పలు మండలాల్లో 600 ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కొనుగోలుకు డబ్బులు మంజూరు చేయడం లేదు. దీంతో పనులు ప్రారంభం కావడం లేదు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి ప్రవహించనున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరుగనున్నది. కృష్ణా నది పరీవాహక ప్రాంతం కూడా గోదావరి జలాలతో స్థిరీకరణ జరుగనున్నది. దీంతో పాలేరు రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు రాని సమయంలో గోదావరి జలాలతో భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడనున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా రైతుల సాగునీటి కష్టాలను కడతేర్చేందుకు కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పనులు పూర్తి చేయించడంలో శ్రద్ధ కనబర్చడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సీతారామ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పాలేరు లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ పనుల్లో భాగంగా 13, 14 ప్యాకేజీల్లో ఇంకా కొన్నిచోట్ల పనులు ప్రారంభంకావాల్సి ఉంది. ఆ ప్రాంతాల్లో భూమి కొనుగోలు జరగాల్సి ఉంది. 15, 16 ప్యాకేజీల్లో 80శాతం మేర పనులు పూర్తిఅయ్యాయి. తిరుమలాయపాలెం మండలంలో టన్నెల్ కాల్వ పనులు రెండు కిలోమీటర్లు పూర్తిఅయ్యాయి. 2026 నాటికి పాలేరు లింక్ కెనాల్ తవ్వకం పనులు పూర్తవుతాయి. – బానాల రమేష్‌రెడ్డి, డీఈఈ
సీతారామ ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేయాలి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులే తప్ప ప్రస్తుతం పనులేమీ జరగడం లేదు. పాలేరు లింక్ కెనాల్ తవ్వకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించి కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేసే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును చేపట్టింది.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ