భద్రాద్రి కొత్తగూడెం, జూలై 17 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) ప్రక్రియ అంగన్వాడీ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్వాడీల్లో అందాల్సిన పోషకాహారాలు, ఇతరత్రా సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు అంగన్వాడీ టీచర్లకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోల) బాధ్యతలు అప్పగించి వారిని ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగం చేయడంతో వారు రేయింబవళ్లూ ఎస్ఐఆర్ ప్రక్రియలోనే తలమునలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో వారు తమ మాతృశాఖ విధులకు తగిన న్యాయం చేయలేకపోతున్నారు. అదీగాక, ఎస్ఐఆర్ విధుల్లోనే వారికి తీరికలేనంత పని ఒత్తిడి ఉంటోంది. ఈ క్రమంలో వారు ఇటు అంగన్వాడీల్లో సేవలు అందించలేకపోతున్నారు. ఏకకాలంలో అటు అంగన్వాడీల విధులు, ఇటు ఎస్ఐఆర్ విధులు చేపట్టలేక సతమతమవుతున్నారు.
అంగన్వాడీ టీచర్లకు ఎస్ఐఆర్ విధుల బాధ్యత మరింత భారంగా మారింది. రెండు చోట్లా రెండు విధులను సమాంతరంగా పూర్తిస్థాయిలో చేయడం వీలుకాకపోవడంతో ఉన్నతాధికారులతో వారు మాటలు పడాల్సి వస్తోంది. ‘కరవమంటే కప్పకుకోపం.. విడవమంటే పాముకు కోపం..’ అనే నానుడిలా అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఎల్వోల విధుల పరిస్థితి వారికి అగమ్యగోచరంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలు నేర్పే టీచర్లకు బీఎల్వోల డ్యూటీలు వేయడంతో నెల రోజుల నుంచి వారు ఇంటింటి ఓటరు సర్వేలో తలమునకలై ఉన్నారు.
అదే సమంయలో మాతృశాఖలో సొంత విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో ఆ శాఖలోని సీడీపీవోలు, సూపర్ వైజర్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. టీచర్లు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకపోతే అక్కడికి పిల్లలు రావడం లేదు. గుడ్లు, పాలు ఇవ్వకపోతే తల్లులు అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ అంగన్వాడీ కేంద్రాన్ని మూసివేసి బీఎల్వో విధులకు వెళ్తే మరుసటి నాటికి ఉన్నతాధికారులకు సవాలక్ష ఫిర్యాదులు. దీంతో అంగన్వాడీ టీచర్లందరూ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఇంతలో ఎన్నికల విభాగం అధికారులు వచ్చి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వీరికి ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ వారు ఆదేశించడంతో మళ్లీ ఓటర్ల ఇళ్లకు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అంగన్వాడీల్లో అందే సేవలు ఎంతో కీలకం. అందుకని ఈ సేవల్లో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంతటి కీలకమైన విధులు నిర్వహించే అంగన్వాడీలకు ఎన్నికల విధులు అప్పగిస్తుండడంతో వారు అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సి సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆయాలు లేని చోట ఉన్న అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వస్తోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను తీసుకొచ్చి వారికి ఆట పాటలు నేర్పాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి వారికి పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. తల్లులకు కూడా ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని వండి పెట్టాల్సి ఉంటుంది.
నిర్ణీత వయసు ఉన్న పిల్లలకు తదనుగుణంగా టీకాలు వేయడం, వాటిని నమోదు చేయడం, ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించడం వంటి విధులు కూడా ఉంటాయి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో అయితే ఏరోజుకారోజు లబ్ధిదారులకు అందించిన సేవలను యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. బీఎల్వో విధులు అప్పగించడం ద్వారా అంగన్వాడీలకు ఈ విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలంటూ ఎన్నికల విభాగం అధికారులు ఒకవైపు ఒత్తిడి చేస్తుండగానే.. పిల్లల హాజరును ఎన్హెచ్టీఎస్లో ఎందుకు ఆన్లైన్ చేయలేదంటూ సూపర్వైజర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటితో అంగన్వాడీలు సతమతమవుతున్నారు.
అంగన్వాడీ టీచర్‌గా నేను చాలాకాలంగా పని చేస్తున్నాను. ఇప్పుడు నాకు 64 ఏళ్లు. అయినా నాకు బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) డ్యూటీ వేశారు. నేను ఎలా చేయగలను. ఏదో అప్పట్లో ఉద్యోగం వచ్చింది. ఏడాది అయితే దిగిపోతాను. నాకు ఆన్లైన్ చేయడం రాదు. వేరే వాళ్లని బతిమిలాడి చేయాల్సి వస్తోంది. సీతంపేటలో ఒక టీచర్‌కు కూడా వీపు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంది. అయినా ఆమెకు కూడా అధికారులు బీఎల్వో డ్యూటీ వేశారు. అయినా చేస్తున్నాం. బీఎల్వో విధుల అప్పగింత విషయంలో అధికారులే ఆలోచించాలి.
-సరస్వతి, అంగన్వాడీ టీచర్, కొత్తగూడెం
రెండు విధులు అప్పగించడం, వాటిని వేగంగా చేయాలంటూ ఒత్తిడి చేయడం వంటి కారణాలతో అంగన్వాడీ టీచర్లు నలిగిపోతున్నారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించే అంగన్వాడీలకు అదనపు విధులు కేటాయించడం దారుణం. రెండు డ్యూటీల వల్ల వారు సతమతమవుతున్నారు. అంగన్వాడీ విధులు నిర్వహించకపోతే ఐసీడీఎస్ అధికారులు మందలిస్తారు. బీఎల్వో విధులు ఆలస్యమైతే ఎన్నికల అధికారులు ఆగ్రహిస్తారు. దీంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.
-జీ.మణి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
అంగన్వాడీ టీచర్లకు రెండు డ్యూటీలు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగానే ఉంటోంది. అయినా వారు ఎంతో శ్రమకోర్చి రెండు చోట్లా విధులకు న్యాయం చేస్తున్నారు. ఆయాలు లేని చోట వేరే వారితోనైనా పనులు చేయిస్తున్నారు. బీఎల్వో విధుల్లో ఉన్నప్పటికీ సమయం చూసుకొని అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని చెబుతున్నాం. టీచర్లను ఇబ్బంది పెట్టడం లేదు. ఎన్నికల డ్యూటీ కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. పైఅధికారుల ఒత్తిడి అలాగే ఉంటుంది.
-పద్మశ్రీ, సీడీపీవో, కొత్తగూడెం