కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22 : అటు అభివృద్ధిలోనూ, ఇటు కార్మికుల సంక్షేమంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ఆంధ్రా పాలనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బొగ్గు ఉత్పాదన సంస్థ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రోజురోజుకూ చేరవవుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఈ సంస్థ ఏటికేడూ లక్ష్యాలు ఛేదించుకుంటూ వెళ్తోంది. ఇందులో కీలకభూమికగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంది. కార్మికులకు అప్పటి వరకూ 19 శాతంగా ఉన్న లాభాల్లో వాటాను ఏకంగా 32 శాతానికి పెంచింది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1989లో సింగరేణి సంస్థ ఆవిర్భవించింది. 1921 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా రూపుదిద్దుకుంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా దేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పాదన సంస్థగా మన సింగరేణి సంస్థకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త మైన్లు, ఓపెన్ కాస్ట్‌ల వంటివి అనేకం ప్రారంభించి సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి తోడ్పాటును అందించారు. అప్పటికే జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తెలంగాణ ఏర్పడ్డాక కారుణ్య నియామకాల పేరుతో తిరిగి ప్రారంభించారు. గత ఏడాది వరకు 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు, కంపెనీలో ఖాళీలను గుర్తించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 4,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,700 మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా కల్పించారు.
ఐఐటీ, ఐఐఎం చదివే కార్మికుల పిల్లలకు ఫీజులు తిరిగి చెల్లించడంతోపాటు రూ.10 లక్షల గృహ రుణాలపై వడ్డీ చెల్లింపు, ఉచిత కరెంట్, ఏసీ సౌకర్యంతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం 17 ఓపెన్‌కాస్ట్ మైన్లు, 22 అండర్ గ్రౌండ్ మైన్లు మాత్రమే నడుస్తున్నాయి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా అడుగు పెట్టి దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో వివిధ కార్యాలయాలకు ఏర్పాటు చేసే విద్యుత్ దీపాలంకరణలో కూడా మూడు రంగులు మాత్రమే కనిపించడంతో సింగరేణిలో రాజకీయ పెత్తనం ఏ మేరకు పెరిగిపోయిందో అర్థమవుతోంది. ఈసారి సింగరేణి డే వేడుకలు కూడా కార్మికుల సందడి లేకుండా అధికారుల హడావిడే కనపడడం, కార్మికుల కుటుంబాలకు నిర్వహించే పోటీలను కూడా ఎలాంటి ప్రచారం లేకుండా నిరాడంబరంగా నిర్వహించడం వంటివి కార్మికులకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
సింగరేణి ఆవిర్భావ వేడుకల సెంట్రల్ ఫంక్షన్‌కు కొత్తగూడెం ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. సోమవారం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయా ఏరియాల్లో ఏర్పాట్లు చేశారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సంస్థ సీఎండీ బలరాం హాజరవుతారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు.