కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు/ మణుగూరు టౌన్/ సత్తుపల్లి టౌన్/ రుద్రంపూర్, జూలై 11: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) ప్రతినిధులు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలతోపాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 13వ రోజుకు చేరాయి.
కోలిండియాలో మాదిరిగా సింగరేణి అధికారులకు కూడా పే అప్‌గ్రేడేషన్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్పీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే చొరవ తీసుకొని సింగరేణి అధికారుల సమస్యలను పరిష్కరించాలని ఆయా కార్యక్రమాల్లో ప్రతినిధులు కోరారు. కొత్తగూడెం దీక్షల్లో డిప్యూటీ మేనేజర్లు రవికుమార్, జశ్వంత్, సీనియర్ ఏవోలు శ్రావిక, ప్రత్యూష, వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్బాల్ షరీఫ్, ఇల్లెందులో సిలివేరు విజయ్‌కుమార్, మురళీమోహన్, గుగులోత్ రాందాస్, వీసం కృష్ణయ్య, జి.శివప్రసాద్, కేశవరావు, మణుగూరులో మదన్‌నాయక్, రమేశ్, సీతారాంబాబు, భాస్కర్, సత్తుపల్లిలో వి.వేణుగోపాల్‌రావు, ఎస్.లోకేశ్, జి.నరేశ్ కుర్చున్నారు. దీక్షలకు మహిళా కెమిస్టులు, కార్మికులు, పలువురు సంఘీభావం ప్రకటించారు. మద్దతు తెలిపిన వారిలో జై గట్టయ్య, మొగిలిపాక రవి, పూర్ణచంద్రరావు, సింగర్ శ్రీనివాస్‌రావు, కెరీన్, దివ్యశ్రీ ఉన్నారు.