కారేపల్లి, సెప్టెంబర్ 29 : కారేపల్లి మండల కేంద్రంలోని సింగరేణి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉందని, పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. సింగరేణి మండలంలో 16 ఎంపీటీసీలలో ఒక స్థానం కూడా ఎస్సీలకు కేటాయింపు జరగలేదన్నారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో సింగరేణి మండల ఎస్సీలకు అన్యాయం జరిగిందని దాన్ని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆదెర్ల రాములు, సింగరేణి మండల కన్వీనర్ బోగిళ్ల వెంకటేశ్వర్లు, నాయకులు సోమందుల నాగరాజు, ఎర్రబెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.