రామవరం, ఏప్రిల్ 2: సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది. ఏరియాలోని జేవీఆర్వోసీ 100 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించగా, కిస్టారం ఓసీ కూడా 20 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి. అంతేకాకుండా సంస్థ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిసి వార్షిక ఆదాయం సుమారు రూ.1700 కోట్లు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంస్థ వ్యాప్తంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడమే కాకుండా రవాణాలో కూడా 135.19 లక్షల టన్నుల రవాణా చేసి సింగరేణిలోనే మొదటి వరుసలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. సంస్థ ఉత్పత్తి లక్ష్య సాధనకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో కార్మికులు, పరిసర ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికీ అంతే ప్రాధాన్యమిస్తున్నది. రూ.400 కోట్లతో 2022లో సమంతా కంపెనరీ సీహెచ్‌పీ నిర్మాణం జరిగినప్పటికీ నుంచి గత నెల వరకు 50.30 లక్షల టన్నుల బొగ్గు 1,821 రేకుల ద్వారా సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా అయింది.
అభివృద్ధి పనులు.. పార్క్‌లు..
సంస్థ రూ.2.5 కోట్లతో జీకేవోసీలో ఎకో పార్కు నిర్మించింది. రూ.2.0 కోట్లతో ప్రగతి వనంలో రెండు యోగా పార్కులు, సైక్లింగ్ ట్రాక్, కెప్ట్ ఏరియా, వ్యూ పాయింట్, బోటింగ్, అండ్ బోటింగ్ డెక్, లైవ్ గార్డుల పనులను సంస్థ చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏరియా నుంచి సీఎస్ఆర్ బడ్జెట్లో రూ. 3.69 కోట్లకు రూ.85 లక్షలు ఇప్పటివరకు వినియోగించింది. మిగిలిన బడ్జెట్ రూ.2.84 కోట్ల మరికొన్ని పనులు జరుగుతున్నాయి. సత్తుపల్లి, మైన్స్ రెస్యూ స్టేషన్ వద్ద కార్మికుల సౌకర్యార్థం నూతన జనరల్ మేనేజర్ కార్యాలయాల నిర్మాణానికి భూమిపూజ జరిగింది. మైన్స్ రెస్క్యూ స్టేషన్ వద్ద వర్క్‌షాప్ నిర్మాణం పూర్తయింది. అందరి సహకారంతో జీకేవోసీ పబ్లిక్ హియరింగ్ పూర్తయింది. యూనియన్, కార్మికుల అభ్యర్థన మేరకు సంస్థ డిస్పెన్సరీల్లో రెండు షిప్టుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నది. రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నుంచి కొత్తగూడెం భద్రాచలం రోడ్, అక్కడి నుంచి సీహెచ్‌పీ వరకు 54 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది.
కార్మికుల సౌకర్యార్థం క్వార్టర్లు..
సత్తుపల్లిలో 354 క్వార్టర్లను నిర్మించి సంస్థ ఉద్యోగులకు కేటాయించింది. అంతేగాక అధికారులు, ఉద్యోగుల కోసం వేర్వేరు చోట్ల రూ.174.5 కోట్ల వ్యయంతో వందలాది క్వార్టర్లు నిర్మిస్తున్నది. 2018 నుంచి మెడికల్ ఇన్వాలిడేట్ లేదా మరణించిన 633 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల్లో భాగంగా 493 మందికి ఉద్యోగాలు కల్పించారు. 54 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఏక మొత్తంలో ఎల్ఎస్పీ ద్వారా రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. ఒక్క ఈ ఏడాదిలోనే 29 మందికి కారుణ్య నియామక పత్రాలు అందాయి. 2018 నుంచి ఇప్పటి వరకు 2,250 సీపీఆర్ఎంఎస్ హెల్త్ కార్డులకు 2,223 సీపీఆర్ఎంఎస్ హెల్త్ కార్డులను జారీ అయ్యాయి. 2022లో 189 గ్రాడ్యుటీ క్లెయిమ్‌లకు 130 క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయి. మిగిలిన 59 క్లెయిమ్‌లు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి.
ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు..
2022లో 306 మంది ఉద్యోగులకు హెచ్పీఎల్ఐఆర్ స్కీంలో భాగంగా కంపెనీ నియమాలను అనుసరించి సంస్థ ఇంటి వడ్డీ మొత్తాన్ని చెల్లించింది. సింగరేణి సేవా సేమితి ద్వారా రామవరం, రుద్రంపూర్, గౌతంపూర్, ములుగూడెం, ప్రశాంతినగర్, సత్తుపల్లికి చెందిన 240 మంది మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ విభాగంలో శిక్షణ ఇస్తున్నది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో క్వాలిఫై అయిన ఏరియా పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో 66 మందికి ఈవెంట్స్‌లో శిక్షణ ఇచ్చింది. వీరిలో 61 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇప్పటివరకు 25 సింగరేణి పరిసర ప్రాంతాలు, 65 గ్రామాల్లో 65 మెడికల్ క్యాంపులు నిర్వహించి సింగరేణి వైద్యులు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి 6,501 మందికి మెడిసిన్ అందించారు.
ఏరియా వార్షిక ఉత్పత్తి 91 శాతం..
సంస్థ కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందజంలో నిలిచాం. 91 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం. రికార్డ్ నెలకొల్పిన కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నికల్ సిబ్బందికి అభినందనలు. ఏరియాలోని జేవీఆర్వోసీ 100 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించాం. కిష్టారం ఓసీ నుంచీ 20 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం. అంతేకాకుండా సంస్థ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిసి వార్షిక ఆదాయం సుమారు రూ.1700 కోట్లు వచ్చినట్లు అంచనా వేశాం. ఏరియా నుంచి 135.19 లక్షల టన్నుల రవాణా చేసి సింగరేణిలోనే ముందంజలో నిలిచాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను ఛేదిస్తాం.
– జీఎం జక్కం రమేశ్, సింగరేణి కొత్తగూడెం ఏరియా