కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 26 : సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.4,701 కోట్లలో 33 శాతం వాటా రూ.1,551 కోట్లు కార్మికులకు చెల్లించాలని, లేదంటే దశలవారీ ఆందోళనలు చేస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్నారు. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ (పా) వెంకటేశ్వర్‌రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం అందించారు.
అనంతరం కృష్ణ మాట్లాడుతూ సంస్థ సాధించిన లాభాలు ప్రకటించిన తర్వాత అందులో నుంచే లాభాల వాటా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని సంస్థ అభివృద్ధి కోసం అని కొన్ని నిధులను పక్కన పెట్టి.. మిగిలిన డబ్బుల్లో లాభాల వాటా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు తుమ్మ శ్రీనివాస్, వసికర్ల కిరణ్, రాసూరు శంకర్, బూర్గుల రవికుమార్, కాగితపు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.