కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 11 : సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ తవ్వకంలో లభ్యమైన 110 లక్షల ఏళ్ల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసర్ కాలానికి చెందిన శిలాజాల కలపను పొందుపరుస్తూ బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన సింగరేణి పెవిలియన్‌ను సింగరేణి సీఎండీ బలరాం, బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక చైర్ పర్సన్ నిర్మల బిర్లా శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలో మేడిపల్లి ఓసీ గనిలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్న క్రమంలో రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజాల రూపంలో లభ్యమయ్యాయని తెలిపారు. వీటిని గోదావరి పరీవాహక ప్రాంతాలలో 110 లక్షల ఏళ్ల క్రితం సంచరించిన తర్వాత అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ అవశేషాలను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ పేర్కొన్నారు.