కొత్తగూడెం సింగరేణి, జూన్ 2: దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి మనందరమూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాన వేడుకల్లో సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా హెడ్డాఫీస్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి, బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బొగ్గు రవాణాను సింగరేణి సాధించిందని, అలాగే అత్యధికంగా రూ.37,500 కోట్ల టర్నోవర్‌ను గడించి సరికొత్త రికార్డు సృష్టించిందని వివరించారు. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన సింగరేణియులకు అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
రాష్ట్రంలోనే కాకుండా సింగరేణి సంస్థతో ఇంధన ఒప్పందం ఉన్న దాదాపు 8 రాష్ర్టాల్లోని 20 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా నిరాటంకంగా బొగ్గును సరఫరా చేస్తూ ఆ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సజావుగా పనిచేసేందుకు దోహదపడుతున్నామని గుర్తుచేశారు. భారీ యంత్రాలు ప్రస్తుతం రోజుకు 15 నుంచి 16 గంటల పాటు మాత్రమే పనిచేస్తున్నాయని, దీనిని కనీసం 20 గంటలకు పైగా తీసుకొస్తే 20 శాతం ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని, తద్వారా మన ఉత్పాదకత పెరుగుతుందని వివరిచాంచారు. గత మార్చి నెలలో ఓపెన్ కాస్ట్ గనుల్లో 20 – 22 గంటలపాటు భారీ యంత్రాలను వినియోగించుకొని అద్భుతమైన ఉత్పత్తులను సాధించామని గుర్తుచేశారు. ఈ ఏడాదికి నిర్దేశించుకున్న 720 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అన్ని ఏరియాల్లో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన అధికారులకు, కార్మికులకు సన్మానించారు. సింగరేణి విభాగాల బాధ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంస్థ ఉన్నతాధికారులు బీఆర్ దీక్షితులు, సత్యనారాయణరావు, యూనియన్ల నాయకులు రాజ్‌కుమార్, త్యాగరాజన్, పొనుగోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.