దుమ్ముగూడెం, ఆగస్టు 27 : ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లుగా ప్రకటించినా అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు అసహనానికి గురవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా.. ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెం మండలంలో చాలా మంది రైతులకు మాఫీ వర్తించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు విడతల్లో భాగంగా.. మొదటి విడతలో 2,200, రెండో విడతలో 1,170, మూడో విడతలో 750 మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. దీంతో మిగిలిన రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో వారంతా వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగిపోతున్నారు. అయితే రుణమాఫీ వర్తించని రైతుల నుంచి తాజాగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటూ అనేక కొర్రీలు, షరతులు, మెలికలు పెడుతున్నారని మండిపడుతున్నారు.
ధ్రువీకరణ పత్రంలో రైతు కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నెంబర్, వయస్సు, కుటుంబానికి ఉన్న బంధం తదితర అంశాలను పూర్తి చేయిస్తున్నారు. రుణమాఫీ కోసం దరఖాస్తు తీసుకున్న రైతు ఏ పరిధిలో ఉంటే అక్కడి పంచాయతీ కార్యదర్శి సంతకం చేయించి వ్యవసాయాధికారులకు అందించాలనేది ధ్రువీకరణ పత్రం సారాంశం. అంతేకాక అర్హులు కారని నిర్ధారణ అయితే రుణమాఫీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు కూడా అందులో పొందుపర్చడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
వ్యవసాయాధికారుల సూచన మేరకు మంగళవారం ధ్రువీకరణ పత్రాలను నింపుకుని రైతులందరూ మండల పరిషత్ కార్యాలయానికి కార్యదర్శుల సంతకాల కోసం చేరుకోవడంతో కిటకిటలాడుతూ కనిపించింది. సంతకం కోసం రైతులు కార్యదర్శులను సంప్రదిస్తే.. మాకు ఆదేశాలు ఏమీ లేవని కార్యదర్శులు చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ వ్యవసాయాధికారి నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధ్రువీకరణ పత్రంలో కార్యదర్శి సంతకాలు తీసుకోవాలని చెప్పామన్నారు. ఇదే విషయమై ఎంపీవో పి.రామకృష్ణను వివరణ కోరగా.. కార్యదర్శులకు అలాంటి ఆదేశాలు ఇవ్వాలని మాకు చెప్పలేదని తెలిపారు. దీంతో అధికారుల డొల్లతనం బయటపడినట్లు తెలుస్తోంది.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ విషయంలో ఏనాడూ ఇన్ని ఇబ్బందులు పడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాజాగా చేసిన రూ.2 లక్షల రుణమాఫీ వర్తించాలంటే అధికారులు అడ్డంకులు సృష్టించారు. జాబితాలో నా పేరు రాకపోవడంతో వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారులను సంప్రదించగా.. మాకు తెలియదని సమాధానం దాటవేశారు. నిబంధనలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
– గుగులోతు కృష్ణ, రైతు, సుజ్ఞానపురం, దుమ్ముగూడెం మండలం
మూడు విడతల్లో చేసిన రుణమాఫీ ప్రకటనలో నా పేరు రాలేదు. తాజాగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో వ్యవసాయ శాఖ నుంచి దరఖాస్తు తీసుకొని పూర్తి చేశా. సంతకం కోసం మండల పరిషత్ కార్యాలయానికి వెళితే కార్యదర్శి కనిపించలేదు. ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగితే.. ఫీల్డ్‌లో ఉన్నా అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీకి సంతకం కావాలని అడిగితే.. సంతకం పెట్టాలని మాకు ఎవరూ చెప్పలేదని అన్నారు. ధ్రువీకరణ పత్రంపై నేను సంతకం పెట్టనంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు.
– పిట్టా పూర్ణచందర్రావు, రైతు, చిన్నబండిరేవు