ఖమ్మం కమాన్‌బజార్, జూలై 3 : విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు ఖమ్మంలో గురువారం ఆందోళన చేపట్టారు. తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు.
కార్యాలయాల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ విద్యార్థులు మంత్రుల క్యాంపు కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు.
ప్రజాప్రతినిధులకు ప్రతినెలా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు క్రమం తప్పకుండా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్లు రాకపోవడం వల్ల ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని అన్నారు. ఫలితంగా విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఉపకార వేతనాల బకాయిలు, రూ.200 కోట్ల బెస్ట్ అవైలబుల్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతోపాటు బస్‌పాస్‌లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. పీడీఎస్‌యూ నాయకులు లక్ష్మణ్, వినయ్, చందు, అశోక్, ప్రసాద్, వెంకటేశ్ పాల్గొన్నారు.