అశ్వారావుపేట, ఏప్రిల్ 28 : ‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామానికి చెందిన మహిళలు సవాల్ విసిరారు.
సోమవారం భూభారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరైన గుర్రాలచెరువు గ్రామానికి చెందిన పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో.. ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే మహిళలు కొంత దూరం మంత్రి వెనుకే వెళ్లారు. అయినా మంత్రి కలవకపోవడంతో అధికారులు, కాంగ్రెస్ నేతల తీరుపై మహిళలు కలపాల పుష్ప, సరస్వతి, మరియమ్మ, సొంగ లక్ష్మి మండిపడ్డారు. ఈ నాయకులకు పేదల కంటే డబ్బున్నోళ్లే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం? ఇందిరమ్మ రాజ్యం? అంటూ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటినే అమలు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తొలుత మండలంలో పర్యటించిన మంత్రి మండల పరిషత్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం-2025 రైతు అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
మొదటి విడతలో స్థలాలు ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇందిరమ్మ కమిటీలు కూడా అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే అధికారులు రద్దు చేస్తారని, ఈ విషయంలో కమిటీ బాధ్యులు నొచ్చుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ కె.సుజాత తదితరులు పాల్గొన్నారు.