మణుగూరు టౌన్, జూలై 9 : ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యాయత్నాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని, ఖమ్మంలో జిల్లాలో ఒకరు, భద్రాద్రి జిల్లాలో ఒకరు ప్రాణాలు విడుస్తుంటే అండగా నిలవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని, ఇది ఎంతవరకు సబబు అని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతులకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు. ఆయా ఘటనల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం, ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఉసురు తప్పక తగులుతుందని, ముదిగొండ, రఘునాథపాలెం మండలాల రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.