ఖమ్మం, ఏప్రిల్ 1 : ఎన్నికల విధులు, బాధ్యతలపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ విధులు, ఈవీఎం యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన పొందాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలన్నారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం-7లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలింగ్ స్టేషన్ ఎదుట ప్రదర్శించాలన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫారం-12ఏ, ఫారం-12 ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోస్టల్ బ్యాలెట్లు పొంది, కచ్చితంగా తమ ఓటు హకు వినియోగించుకోవాలన్నారు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఎన్నికల నిర్వహణ వంద శాతం విజయవంతం చేయాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ఈవీఎం యంత్రాలతో హాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీవో జి.గణేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.శ్రీరామ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.