ఖమ్మం సిటీ, మే 26: నోటికొచ్చిన అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.. ప్రజలతోపాటు ఉద్యమకారులకు ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది.. రెండున్నరేండ్లు గడిచినా కేకే కమిటీని వేసి కాలయాపన చేస్తూ వచ్చింది.. మరోసారి మోసపూరిత మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఉద్యమకారులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
ఉద్యమకారులమని చెప్పుకుంటున్న కొద్దిమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం మొదట్నుంచీ కొట్లాడి, నిర్బంధాలను ఎదుర్కొని జైళ్లకు వెళ్లిన వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి, కొట్లాడి సాధించిన తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపారన్నారు. అన్నింటినీ యాదిలో ఉంచుకుని, కొందరు చేస్తున్న హడావిడికి ఆకర్షితులై మోసపోవద్దన్నారు. తెలంగాణకు మరోసారి కేసీఆర్ను సీఎంగా చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, బలమైన ఉద్యమం చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు.