12 అంశాల పనుల నివేదికను సిద్ధం చేయాలి
స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి
‘మన ఊరు – మన బడి’సమీక్షలో మంత్రి అజయ్ కుమార్
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: విప్ రేగా, ఎమ్మెల్యే వనమా
పాల్గొన్న జడ్పీ చైర్మన్ కోరం,ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే మెచ్చా
భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో 368 పాఠశాలల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 20:సర్కారు బడుల బలోపేతం కోసమే ‘మన ఊరు – మన బడి’కి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. దీనిని అమలు చేసే బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు. ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమాల అమలుపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఈ పథకాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 అంశాల పనులు చేపట్టాలన్నారు. రూ.3 వేల కోట్లతో 9,123 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్తరూపు రేఖలు రానున్నాయని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, డిజిటల్ విద్య, నీటి సదుపాయాలతోపాటు టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నీచర్, పాఠశాలకు పెయింటింగ్స్, శిథిలావస్థలో ఉన్న గదులకు బదులుగా అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, మరమ్మతులు, డైనింగ్ హాల్ వంటి ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన పాఠశాలల్లో తక్షణమే చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘ కసరత్తు చేసి సిఫార్సు చేసినట్లు ఆయన వివరించారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రామాణికంగా తీసుకొని మొదటి దశలో 246 ప్రాథమిక, 57 ప్రాథమికోన్నత, 65 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 368 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కావాలన్నారు. పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు తయారు చేసిన కరదీపికను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పర్యవేక్షణ, మండల ప్రత్యేక అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. రూ.2 లక్షల వరకు విరాళం అందజేస్తే ఎస్ఎంసీలో చోటు కల్పిస్తామని, రూ.10 లక్షల వరకూ విరాళం అందజేస్తే తరగతి గదికి పేరు పెడతామని, రూ.కోటి ఇస్తే పాఠశాలకు దాతపేరు పెడతామని అన్నారు. దాతలు ముందుకు రావాలని కోరారు.
గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం: విప్ రేగా
గొప్ప గొప్ప కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యసాధన కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్సీ తాతా మధు
ప్రభుత్వం ప్రతిపాదించిన 12 అంశాలతోపాటు క్రీడలు, గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. గతంలో ఆయా పాఠశాలల్లో చదువుకొని స్థిరపడిన విద్యార్థుల జాబితా సేకరించి ఆ బడుల బలోపేతం కోసం విరాళాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది మహోన్నత కార్యక్రమం: ఎమ్మెల్యే వనమా
‘మన ఊరు మన బడి’ అనేది మహోన్నత కార్యక్రమమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానునున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు.
అనంతరం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ అన్ని రంగాలలతోపాటు విద్యారంగాన్నీ ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 35 శాతం విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేశామన్నారు. అనంతరం ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ నిర్వహణ కమిటీల కరదీపికలను ఆవిష్కరించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, డీఈవో సోమశేఖరశర్మ, మండల ప్రత్యేక అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.