ఖమ్మం రూరల్, జూలై 07 : పాడి పంటలు, పశు సంపద వెళ్లి విరియాలని సీత్లా భవాని అమ్మవారిని ప్రార్థించినట్లు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తెలిపారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనుల ఆరాధ్య దైవం సీత్లా భవాని పండుగను ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద తండా, ఇతర కాలనీల నుండి పెద్ద ఎత్తున కాలనీవాసులు పెద్ద తండా సెంటర్లోని సీత్లా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. గిరిజనుల ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి అపరాల పంటలకు సంబంధించిన పలుపంట ఉత్పత్తులను వండి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రావతి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే కాలంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశు సంపద మరింత పెంపొందాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘం పెద్దలు,, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.