ఖమ్మం రూరల్, మే 31 : అపరిచితుల వద్ద కాకుండా మీకు నమ్మకమైన డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల రైతులకు సూచించారు. శుక్రవారం ఆరెకోడు తండా, తనగంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అలాగే పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు విత్తనాలు అమ్ముతామనే వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. డీలర్ వద్ద గడువు మీరిన తేదీ ఉన్నా, లాట్ ఐడీ తదితర వివరాలు లేకుంటే వాటిని కొనుగోలు చేయొద్దన్నారు. గ్రామాల్లో భూమి సారాన్నిబట్టి, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలకు అనుగుణంగా విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. వర్షాలు త్వరలోనే కురిసే అవకాశం ఉన్నందున లోతు దుక్కులు దున్నుకోవాలని, పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టాలన్నారు. కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎస్.విజయచంద్ర, మండల వ్యవసాయాధికారి వానకాలం సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ఏఈవోలు పాల్గొన్నారు.