రఘునాథపాలెం, మే 29: సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పేరుతో కాంగ్రెస్ సర్కారు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. సహకార సొసైటీల్లో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు, జనుములు అందుబాటులో ఉన్నాయంటూ చెబుతూనే ధరలను మాత్రం రైతులకు అందనంత దూరం చేసింది. వానకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాల ధరలను రెట్టింపు చేసింది. పైగా సబ్సిడీపై ఇస్తున్నామంటూ అన్నదాతలను మోసం చేస్తోంది. పంట పొలాలను సారవంతం చేసేందుకు పచ్చిరొట్ట (జనుము, జీలుగు, పిల్లిపెసర) విత్తనాలను రైతులు వినియోగిస్తారు.
గత కేసీఆర్ సర్కారు పాలనలో ఈ పచ్చిరొట్ట విత్తనాలపై సబ్సిడీ లభించింది. సేంద్రియ సాగులో భాగంగా భూసారాన్ని కాపాడేందుకు ఏటా ప్రభుత్వాలు పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందిస్తుంటాయి. గడిచిన పదేళ్లపాటు కూడా కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక శాతం సబ్సిడీపై అందించింది. అదే మాదిరిగానే ఈ ఏడాది వానకాలంలో కూడా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ధరలను మాత్రం రెట్టింపు చేసింది. పైగా సహకార సొసైటీల్లో పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీ ధరలకే అందిస్తున్నామంటూ గొప్పలు చెబుతోంది.
తీరా నిరుటి ధరలతో పోలిస్తే అది రెట్టింపుగా ఉన్నాయి. గత ఏడాది 30 కేజీల జీలుగులబస్తా ధర రూ.1,116గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని రూ.2,138కు పెంచింది. 40 కేజీల జనుముల బస్తా నిరుడు రూ.1,448గా ఉంటే ఈ ఏడాది రూ.2,510 చేసింది. ఈ పంట పొలాలను సారవంతం చేసుకోవాలనుకునే రైతులు.. ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తనాల ధరలను చూసి హడలిపోతున్నారు. ఈ ధరలను గతంలో ఎన్నడూ లేవని వాపోతున్నారు.
పచ్చిరొట్ట విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నామంటూ చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. ధరలను రెట్టింపు చేసి రైతులను మోసం చేస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే జీలుగులు, జనుములు విత్తనాల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. నేలను సారవంతం చేసుకునేందుకు ఉపయోగించే పచ్చిరొట్ట విత్తనాలపై సబ్సిడీ మెరుగైన ఇవ్వలేకపోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులపై భారాన్ని మోపుతూనే ఉంది. ధర తగ్గించి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి.
-గుత్తా రవి, రైతు, చిమ్మపూడి