మామిళ్లగూడెం, జనవరి 18: ఖమ్మం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాల భవనం ప్రారంభోత్సవం, అనంతరం జరిగిన బీఆర్ఎస్ తొలి సభకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులతోపాటు టీఎస్ఎస్పీ బెటాలియన్లు, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, నల్లగొండ, కరీంనగర్ తదితర మొత్తం 30 జిల్లాల నుంచి సుమారు 6,000 మంది పోలీసు బలగాలను మోహరించారు.
ఐజీపీ షహన్వాజ్ ఖాసీం, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించడంతో పారింగ్, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా కొనసాగింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ని మర్యాద పూర్వకంగా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం నూతన కలెక్టరేట్‌కు చేరుకున్న డీజీపీ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీవీఐపీల పర్యటనలో ఎలాంటి ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా ఐదు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. వీవీఐపీల పర్యటన ప్రశాంతంగా సాగింది.
ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐజీపీ షహన్వాజ్ ఖాసీం, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, కె.రమేశ్‌నాయుడు, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో ప్రతి ఒకరూ కష్టపడి నిబద్ధతతో పని చేశారని పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు చేరుకోవడంలో, సభ అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
తనిఖీలకు 20 డాగ్ స్కాడ్స్
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 18: బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభకు నలుగురు సీఎంలు, ఒక మాజీ సీఎం, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు, లక్షలాదిగా జనం హాజరైన నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు డాగ్ స్కాడ్స్ పనిచేశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వివిధ రకాల జాతులకు చెందిన 20 డాగ్ స్కాడ్స్ బహిరంగ సభలో తనిఖీలు చేశాయి. సభా ప్రాంగణంలోని అణువణువునూ, ప్రధాన వేదికనూ పరిశీలించాయి. ల్యాబ్, జర్మన్ షెపర్డ్ జాతులకు చెందినవే ఎక్కువగా డాగ్ స్కాడ్ విధుల్లో ఉన్నాయి.