భద్రాచలం/ దుమ్ముగూడెం/ చర్ల, ఆగస్టు 20: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 42.20 అడుగులుగా ఉన్న గోదావరి.. 8:15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 10 గంటలకు 43.60 అడుగులు, మధ్యాహ్నం 12 గంటలకు 44.30, సాయంత్రం 3 గంటలకు 45.40, సాయంత్రం 6 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. ఎగువన ఓవైపు శ్రీరాంసాగర్ నుంచి, మరోవైపు చర్ల తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద చేరడంతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
బుధవారం రాత్రి 11 గంటలకు 48.30 అడుగులు దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు కలిసి బుధవారం భద్రాచలం చేరుకొని కరకట్ట వద్ద గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరకుండా ఉండేలా స్లూయిజ్ మోటర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్లూయిజ్ నుంచి లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తి మళ్లీ గోదావరిలో పోసేలా మోటర్లు సిద్ధం చేశారు.
గోదావరి ఉధృతికి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సన్నద్ధంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలతో కలెక్టర్ చర్చించారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి పెరుగుతుండడంతో కరకట్టతోపాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. కాగా, వరద ఉధృతి ఎక్కువ కావడంతో స్నానఘట్టాలను, కల్యాణకట్టను ఆనుకొని వరద ప్రవహిస్తోంది. దీంతో భక్తులను గోదావరిలోకి అనుమతించడంలేదు. గోదావరి ఉధృతికి భద్రాచలం – కూనవరం మధ్యలోని మురుమూరు వద్ద రహదారిపైకి, తూరుబాక డైవర్షన్ రోడ్డుపైకి వరదనీరు చేరింది. దీంతో అటు భద్రాచలం – చర్ల, ఇటు భద్రాచలం – కూనవరం ప్రాంతాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, ఐటీడీఏలోనూ కంట్రోల్ రూంలు అధికారులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు 7995268352, 08743-232444, 7981219425 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి వరద ప్రవాహం బుధవారం 23 అడుగులకు చేరుకుంది. తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డు ప్రధాన రహదారిపైకి ఇప్పటికే వరదనీరు చేరుకుంది. దీంతో చర్ల – భద్రాచలం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. బుర్రవేముల వద్ద కూడా రోడ్డుపైకి వరదనీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, నీట మునిగిన తూరుబాక డైవర్షన్ రోడ్డును కలెక్టర్ జితేశ్, ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం పరిశీలించారు. అనంతరం తూరుబాక వద్ద మండల మ్యాప్‌ను పరిశీలించారు. గోదావరి ఉధృతి మరింత పెరిగితే తూరుబాక డైవర్షన్ పాయింట్ వద్దకు వరద ఎక్కువగా చేరుకుంటుందని అన్నారు. అందుకని ఆ సమయంలో ములకపాడు మీదుగా భద్రాచలం వైపు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మార్గంలో ఇసుక లారీలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. వరద మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, తహసీల్దార్ మామిడి అశోక్‌కుమార్, ఎంపీడీవో వివేక్‌రామ్, సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు గోదావరి పరీవాహక ప్రాంతాలు, వాగుల వైపు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు లేకపోవడంతో బుధవారం తాలిపేరుకు వరద తగ్గుముఖం పట్టింది. కానీ, గోదావరి మాత్రం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో చర్ల మండలంలోని గోదావరి పరీవాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక గ్రామాలైన దండుపేట, కొత్తపల్లిలోకి నీరు ప్రవేశించే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టారు. వీరితోపాటు రెండో ప్రమాద హెచ్చరిక గ్రామాలైన గొంపల్లి, లింగాపురం, లింగాల, ముమ్మిడివరం, జట్టిగూడెం, పెద్దిపల్లి, దేవరపల్లి, వీరాపురం, లింగాపురంపాడు, మేడువాయి, కుదునూరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.